నిజామాబాద్, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరం లో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన కవి సమ్మేళనం, ముషాయిరా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు.
సాహిత్య దినోత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ లో కవి సమ్మేళనం, ముషాయిరా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ‘‘ఉద్యమ తెలంగాణ-ఉజ్వల తెలంగాణ’’ అనే అంశంపై ఉదయం 9:30 గంటలకు జిల్లా స్థాయి కవి సమ్మేళనం జరుగుతుందని తెలిపారు. ఈ కవి సమ్మేళనంలో పాలుపంచుకునే కవులు, కవయిత్రులు మూడు పద్యాలను లేదా 20 పంక్తులను మించని వచన కవిత చదవవలసి ఉంటుందని, తమ రచనలు ఎటువంటి వివాదాస్పద అంశాలు లేకుండా చూడాలని, పాల్గొనే సాహితీవేత్తలు పాస్పోర్ట్ సైజు ఫోటోతో సహా తమ రచనను, హామీ పత్రమును జూన్ 9వ తేదీలోగా డిపిఆర్‌ఓ కార్యాలయంలో అందజేయాలని ఆయన కోరారు.
కవి సమ్మేళన నిర్వహణ బాధ్యతను డాక్టర్ వి త్రివేణి (9951444803), గంట్యాల ప్రసాద్ (9440356306), డాక్టర్ కాసర్ల నరేశ్ రావు (9441406252), తిరుమల శ్రీనివాస్ ఆర్య (8374002227), మద్దుకూరి సాయిబాబు (8897213286), గణపురం దేవేందర్ (9948032705) లతో కూడిన కమిటీ చూస్తుందని ఆయన తెలిపారు.
అదేవిధంగా ముషాయిరా కార్యక్రమాన్ని కూడా న్యూ అంబేద్కర్ భవన్‌లో 11వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ముషాయిరాలో పాల్గొనదల్చిన కవులు ఉర్దూ ఆఫీసర్ ఆర్షద్, సెల్ : 8555805866, డీపీఆర్‌ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మాజిద్, సెల్: 9949351684 ను సంప్రదించాలని సూచించారు. కవులు, సాహిత్య అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కవి సమ్మేళనం, ముషాయిరా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.