ఆర్మూర్, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ జీరో పాయింట్ పంప్ హౌస్ వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన సాగునీటి దినోత్సవంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
2014 ముందు ఏళ్ల తరబడి సాగునీటి కోసం గోస పడ్డ పరిస్థితుల నుంచి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసిఆర్ నాయకత్వంలో సాగునీటి రంగంలో సాధించిన విప్లవాత్మక విజయాలపై ఈ సమావేశంలో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎస్సారెస్పీ పునరుజ్జీవపథకం,ప్యాకేజీ 21 పై రూపొందించిన డాక్యుమెంటరీ వీడియోలు పెద్ద స్క్రీన్లపై మంత్రి స్వయంగా రైతులకు వివరిస్తూ చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం సీఎం కేసిఆర్ చేసిన మేథోమథనం,పడ్డ కష్టం రైతులకు కూలంకషంగా వివరించారు. రైతులు స్క్రీన్ పై వీడియో చూస్తూ చప్పట్లతో తమ హర్షాన్ని,మద్దతును తెలియజేశారు.
ఈ సందర్బంగా పలువరు రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఒకప్పుడు మొగులుకు మొకం పెట్టి చూసినం కానీ నేడు ఎండాకాలంలో కూడా ఊర్లల్లో చెరువులు నిండుకుండలా ఉన్నాయని వారు సంతోషం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషి వల్ల వేల ఎకరాల పడావు భూములు సాగులోకి వచ్చాయని తెలిపారు. వాగుల మీద చెక్ డ్యాంలు కట్టించి బోర్లలో ఎండిన బోర్లలో నీళ్లు వచ్చేలా చేశారని రెండు పంటలకు నీళ్లు పుష్కలంగా వస్తున్నాయని తమ సంబురాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎవ్వరూ సాగునీటి కోసం ఇంతలా పనిచేయలేదని కేవలం కేసిఆర్ ప్రభుత్వం,మంత్రి ప్రశాంత్ రెడ్డి వల్ల నేడు బాల్కొండ నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యిందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. తలాపున పారుతుంది గోదారి – మన చేను మన చెలుక ఎడారి అని నాడు పాటలు పడుకున్నామని మంత్రి గుర్తు చేశారు. కానీ నేడు చెరువులు,చెక్ డ్యాంలు,కాలువలు,రిజర్వాయర్లు మండుటెండల్లో నిండుగా ఉన్న నీళ్ళతో రైతులంతా సంబురంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇదంతా ఊరికే కాలేదని కేసిఆర్ నిర్విరామ కృషి,అకుంఠిత దీక్ష వల్లే సాధ్యమయ్యిందన్నారు. నాడు సమైక్య పాలనలో ఎండిన బోర్లు – బీడు భూములు ఎక్కిరెంచేవని నేడు చెరువులు,కుంటలు,బోరు బావులు,కాలువలు ఫుల్లుగా నీళ్ళతో కళకళలాడుతున్నాయి అన్నారు.
దీంతో పంటలు ఫుల్ గా పండుతున్నాయని తెలిపారు.60 ఏళ్ల సాగునీటి గోసను తీర్చిన దార్శనిక నాయకుడు కేసిఆర్ అని కొనియాడారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా 310 కి.మీ పైకి 200 కి. మీ సొరంగాల ద్వారా,1531 కి.మి కాల్వల ద్వారా 16 రిజర్వాయర్లు ద్వారా వచ్చిన కాళేశ్వరం జలాలు పంప్ చేసుకొని పోచంపాడు ప్రాజెక్టు నింపుకుంటున్నమని, తద్వారా అక్కడి నుండి లిఫ్టులు, కెనాల్స్ ద్వారా ఊరూరా చెరువులు కుంటలు నింపుకుంటున్నామని వివరించారు. మండుటెండల్లో చెరువులు అలుగులు పరుతున్నయంటే సీఎం కేసిఆర్ చొరవే అని మంత్రి పేర్కొన్నారు.
గోదావరిలో వృధాగా పోతున్న నీటిని కాళేశ్వరం వద్ద ఒడిసిపట్టి అక్కడి నుండి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ గుండా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నింపుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఇవాళ ముప్కాల్ పంప్ హౌస్ జీరో పాయింట్ వద్ద విజయోత్సవ సభ ఏర్పాటు చేశామని వెల్లడిరచారు. ముప్కాల్ పంప్ హౌస్ కోసం 610 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
బాల్కొండ నియోజకవర్గంలో గుత్ప లిఫ్ట్, బోదే పల్లి లిఫ్ట్,నాగపూర్ లిఫ్ట్, జలాల్పూర్ లిఫ్ట్,చౌట్పల్లి హన్మంతు రెడ్డి లిఫ్ట్, ఏర్గట్ల గుమ్మిర్యాల లిఫ్ట్ ద్వారా ప్రతి మండలంలో ఊరూరా చెరువులు నింపుకుంటున్నమని వివరించారు. ప్యాకేజీ 21 ద్వారా భీంగల్, వేల్పూర్, కమ్మర్ పల్లి, మోర్తాడ్ మండలాలకు సుమారు 80వేల ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
సుమారు 100కోట్లకు పైగా ఖర్చుతో పెద్ద వాగు కప్పల వాగు మీద 24 చెక్ డ్యాంలు ఏర్పాటు చేసుకున్నామని వాటితో బోర్లు రీ జనరెట్ అయ్యాయని 40వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చిట్టాపూర్ లిఫ్ట్ పురోగతిలో ఉందని వెల్లడిరచారు. 9ఏళ్ల క్రితం సాగు నీటి కష్టాలతో మన బ్రతుకులు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా మారినయ్ ఒకసారి రైతులు గుండె మీద చేయివేసుకొని ఆలోచన చేయాలని మంత్రి కోరారు.
మండు వేసవిలో కూడా కాకతీయ కాలువ,లక్ష్మి కెనాల్,వరద కాలువ నీటితో నిండుగా ఉన్నాయని అన్నారు. ప్రతిపక్షాలు మాటలు విని మోస పోతే మల్లా గోసపడేది మనమేనని,రైతు బాగు కోరే కేసిఆర్ కు మనమంతా మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి వేముల రైతులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జలవనరుల శాఖ సి.ఈ మధుసూదన్ రావు పలువురు ఇరిగేషన్ అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్‌ఎస్ పార్టీ నేతలు,రైతులు,మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.