కామారెడ్డి, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్లాస్టిక్ నియంత్రణకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. శ్రీదేవి అన్నారు. కామారెడ్డి రోటరీ క్లబ్ ఆవరణలో జిల్లా న్యాయ సేవా సమస్త ఆధ్వర్యంలో గురువారం ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ నిర్మూలనలో మహిళలు భాగస్వాములు కావాలని తెలిపారు.
ప్రజలు తక్కువ దూరం ఉన్నచోట్లకు నడుచుకుంటూ వెళ్లాలని చెప్పారు. వాహనాల వాడకాన్ని వంద శాతం తగ్గించి వాయు కాలుష్యం తగ్గించాలని చెప్పారు. కామారెడ్డి పట్టణంలో ఓ వీధిని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని ప్లాస్టిక్ నిర్మూలన జరిగే విధంగా జిల్లా అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడటం వల్ల కలిగే అనర్థాలను తెలియజేశారు. ప్లాస్టిక్ నిర్మూలనలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలవాలని కోరారు. స్టీల్ టిఫిన్లు, బట్ట, కాగితపు సంచులు వాడుకునే విధంగా రిసోర్స్ పర్సన్లు మహిళలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు వద్దన్నా వినకుండా వ్యాపార సంస్థలు, వీధి వ్యాపారులు వినియోగిస్తే ఆకస్మికంగా దాడులు చేసి కోర్టు ద్వారా జరిమానాలు విధిస్తామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్లాస్టిక్ కవర్లు నిర్మూలన పై పట్టణంలో విస్తృతంగా రిసోర్స్ పర్సన్ లు ప్రచారం చేయాలని తెలిపారు. చెత్త బండి రాకపోతే ప్రజలు రోడ్లపై చెత్త వేయడం వల్ల చెత్త మురుగు కాలువల్లోకి వెళ్తోందని చెప్పారు. దోమలు, ఈగలు వృద్ది చెంది వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సూచించారు. వాతావరణ కాలుష్యం నుంచి భూమిని రక్షించాలని పేర్కొన్నారు. వస్త్ర సంచులను వాడాలని కోరారు.
ప్లాస్టిక్ కవర్ల కాల్చివేతను పూర్తిగా నిర్మూలించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వర్తక సంఘం, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులకు, మహిళలకు బట్ట సంచులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిర్మూలన చేస్తానని, మొక్కల పెంపకం చేపట్టి పర్యావరణం ను రక్షిస్తానని, పర్యావరణ రక్షణ, కాలుష్య నియంత్రణ గురించి అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియా, కమిషనర్ దేవేందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజగోపాల్ గౌడ్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రతినిధులు, స్వచ్ఛభారత్ ఎస్బిఎంలు నారాయణ, మధు కృష్ణ, ఆర్పీలు, స్వయం సహాయక మహిళలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.