కామారెడ్డి, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేపల ఆహారం ఆరోగ్యానికి వరం లాంటిదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నాన్ వెజ్, వెజ్ మార్కెట్లో గురువారం చేపల ఆహారమేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపల ఆహార పండగను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు వంద శాతం రాయితీపై చేప విత్తనాలను ఇస్తుందని తెలిపారు.
మత్స్యకారులకు మోపెడ్లు, ఐస్ బాక్సులు ఇవ్వడం వల్ల చేపలను ఇతర ప్రాంతాలలో విక్రయించుకొనే వెసులుబాటు కలిగిందని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.