ఆర్మూర్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజక వర్గంలోని సకల కులాలకు ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నామని పీయూసీ చైర్మన్, అర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. ‘‘నమస్తే నవనాథపురం’’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్మూర్ పట్టణంలో హుస్నాబాద్ గల్లీలో నిర్వహించిన మున్నురుకాపు కళ్యాణ మండపం (బాజన్న గైని పంత) ప్రహరీ గోడ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ మండపాల నిర్మాణాలన్నీ త్వరలో పూర్తి కానున్నాయని వెల్లడిరచారు. ‘‘అన్ని వర్గాల కుటుంబ పెద్ద కేసీఆర్ గారే. సకల వర్గాలకు సముచిత గౌరవం ఇవ్వాలన్నది బీఆర్ ఎస్ ధ్యేయం. తెలంగాణ పథకాలు దేశానికే స్ఫూర్తి.మన పథకాలు దేశాన్నే ఆకర్షిస్తున్నాయి. దేశమంతా తెలంగాణ స్కీములు కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ సామాజిక వికాసానికి, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నది’’ అని జీవన్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ నియోజక వర్గం పరిధిలో మున్నూరుకాపు, పద్మశాలి, బంజారా,దేవాంగ, కురుమ తదితర సంఘాల కోసం మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తున్నామన్నారు. వివిధ సామాజిక వర్గాల కోసం చేపట్టిన మొత్తం కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని జీవన్ రెడ్డి తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు.
కేసీఆర్ అధ్బుతమైన పాలనతో అన్ని రంగాలలో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం సామాజికంగా కూడా అందనంత ఎత్తుకు ఎదిగి శ్రమైక్య సౌందర్యానికి ప్రతీకగా నిలవాలని ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగమే కుల సంఘాల భవన నిర్మాణాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉంది. సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వారు వెనుకబడి ఉన్నారు. వీటితో పాటు బలహీన వర్గాలకు సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక పురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి, వారి వికాసానికి ఉపయోగపడేవిధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. 75ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో బీసీలను గుర్తించిన దమ్మున్న ఒకేఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.