ఆర్మూర్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలోనీ మోర్తాడ్, భీంగల్, పడగల్, బాల్కొండ గ్రామాల్లో ఈ జూన్ నెలలోనే వారానికి ఒక గ్రామం చొప్పున గృహ ప్రవేశం చేసుకుంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వేల్పూర్ మండలం పడగల్,బాల్కొండ మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేసారు.
బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం పది ప్రాంతాల్లో 1200 ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని అందులో ఇప్పటికే 800 ఇల్లు పూర్తి అయ్యాయని తెలిపారు. మరో 400 ఇల్లు పురోగతిలో ఉన్నాయని త్వరలోనే అవి కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. మోర్తాడ్ గ్రామంలో వచ్చే వారంలో ప్రారంభం చేసుకుంటామని తర్వాత భీంగల్, పడగల్, బాల్కొండ లో ఇళ్ళు ఈనెలలో ప్రారంభించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడిరచారు. పడగల్ లో సి.సి రోడ్డు పనులు,బాల్కొండ లో సి.సి రోడ్డు , సివరేజ్ పనులు పూర్తి కావాల్సి ఉందని 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ పేదల ఆత్మ గౌరవ ప్రతీకగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని అన్నారు. గతంలో ఇండ్లు కాగితాల మీద చూపించి బిల్లులు తీసుకున్నారని కానీ నేడు కండ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. లేటు అయిన మంచిగా కట్టించి ఇస్తున్నామని ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. నిరుపేదలకు పూర్తి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తున్నామని,ఈనెలలోనే సొంత జాగా ఉన్న పేదవారికి గృహ లక్ష్మి పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమం సీఎం కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుందని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షల ఇండ్లు పేదలకు నిర్మించి ఇచ్చామని చెప్పారు. గృహ లక్ష్మి ద్వారా మరో 3లక్షల ఇండ్లు ఇవ్వబోతున్నమని అన్నారు. ఇంటి జాగా లేకుండా ఉన్న పేద వారికి ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తుందని అర్హులైన ప్రతి కుటుంబానికి కేసిఆర్ ప్రభుత్వం సొంత ఇంటి కల నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.