దశాబ్ది సంబురానికి వేదికలైన చెరువు గట్లు

నిజామాబాద్‌, జూన్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు చెరువు గట్లు వేదికలయ్యాయి. మండుటెండల్లోనూ జలకళతో తొణికిసలాడుతున్న చెరువుల వద్దకు ఊరూరా ప్రజలు తరలివచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలు, బాణాసంచా పేలుళ్లు, వలల ప్రదర్శనలతో ఎటు చూసినా వెల్లివిరిసిన ఉత్సాహంతో పండుగ వాతావరణం కనిపించింది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం బాల్కొండ నియోజకవర్గం, భీంగల్‌ మండలంలోని పురాణీపేట్‌ గ్రామ శివారులోని చెన్న చెరువు వద్ద ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. పురాణీపెట్‌ గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి ఈ వేడుకలో భాగస్వాములయ్యారు.

గ్రామ కూడలి నుండి డప్పు వాయిద్యాలు, బోనాలు, బతుకమ్మలతో మంత్రి, కలెక్టర్‌ లకు ఘన స్వాగతం పలికి వారితో కలిసి ప్రదదర్శనగా చెన్న చెరువు వద్దకు చేరుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను పేర్చి, ఆడపడుచులు గౌరమ్మను కొలుస్తూ బతుకమ్మ గేయాలు ఆలపించగా, మంత్రి, కలెక్టర్‌ సైతం పాల్గొని మహిళలను ఉత్సాహపర్చారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ, చెరువుల పండుగ అట్టహాసంగా సాగింది. చెరువుల ఔన్నత్యాన్ని చాటుతూ, గోరెటి వెంకన్న ఆలపించిన గేయాల రికార్డింగులు ఆలోచింపజేస్తూ అందరిలోనూ జోష్‌ నింపాయి. చెరువు గట్టున కట్ట మైసమ్మకు పూజలు చేసిన మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, తీర్థ ప్రసాదాలను చెరువు జలాల్లోకి వదిలారు. చెరువు గట్టునే స్థానికులతో కలిసి మంత్రి, కలెక్టర్‌ సహపంక్తి భోజనాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, నిండు కుండలను తలపిస్తున్న చెరువుల వద్ద పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తోందని, తెలంగాణ సాధన కోసం తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందనడానికి చెరువు గట్లపై ఊరూరా ఉత్సవాలు నిర్వహించుకోవడం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంత చెరువులు నీళ్లు లేక బీటలు వారి కనిపించేవని, బోరుబావులు వట్టిపోయి, కరెంటు కష్టాలతో రైతులు తల్లడిల్లేవారని నాటి దుర్భర స్థితిగతులను గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో గంగాళం వంటి తెలంగాణ చెరువులు తాంబూలం (సాసర్లు)గా కుచించుకుపోయాయని ఆవేదన వెలిబుచ్చారు. తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సివచ్చేదని అన్నారు. మలివిడత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ నాయకత్వంలో సబ్బండవర్ణాలు ఏకమై పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన దార్శనిక పాలనతో నాలుగైదేళ్ల స్వల్ప వ్యవధిలోనే సాగు, తాగు నీటి ఇక్కట్లను పారద్రోలారని, పల్లె పల్లెనా సమృద్ధిగా నీటి వనరులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని మంత్రి తెలిపారు.

చెరువుల్లో నీళ్లుంటే అందరి బతుకులు బాగుపడతాయని, రైతులకే కాకుండా మత్స్య కార్మికులకు, రజకులకు, వివిధ వర్గాల వారికి ఉపాధి మెరుగుపడుతుందని, ప్రజల అవసరాలకు సరిపడా నీటి వసతి లభిస్తుందని భావించి మిషన్‌ కాకతీయ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45 వేళా చెరువుల్లో పూడికతీత, కట్టలు, తూముల మరమ్మతులు వంటి ఆధునికీకరణ పనులు జరిపించారని అన్నారు. దాని ఫలితంగానే ప్రస్తుతం మండుటెండల్లోనూ చెరువులు జలకళతో అలుగులు పారుతున్నాయని అన్నారు. అంతేకాకుండా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలతో భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయన్నారు.

ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 16 చెక్‌ డ్యాంలు నిర్మించామని, మరో 7 చెక్‌ డ్యామ్‌ లు కొత్తగా మంజూరు చేయించానని తెలిపారు. ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో ఏడాది పొడుగునా నీటి నిల్వలు నిండుగా ఉండాలనే తపనతో సుమారు 2 వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ పునరుజ్జీవ పథకం కింద రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం జలాలను మళ్లించడం జరిగిందన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు గోదావరి జలాలు అందేలా 21 వ ప్యాకేజీ పనులను 1700 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగిందని, త్వరలోనే ఈ పనులు పూర్తి కానున్నాయని తెలిపారు.

వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, సాగు,తాగు నీటికి ఇబ్బంది ఉండదని భరోసా కలిపించారు. మరో పక్షం రోజుల్లో కప్పలవాగు లోకి నీటిని మళ్లిస్తానని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. తెలంగాణ కోసమే పుట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని కొనియాడుతూ, ఆయన సారధ్యంలో తెలంగాణ సంక్షేమాభివృద్ధిలో అగ్రపథంలో పయనిస్తోందని అన్నారు. తెలంగాణ రైతాంగానికి తమ ప్రభుత్వం చేస్తున్నంతగా మేలు, దేశంలోనే మరే ప్రభుత్వాలు చేయడం లేదన్నారు.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, మిషన్‌ కాకతీయ కార్యక్రమంతో చెరువులన్నీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని అన్నారు. జిల్లాలో రూ. 351 కోట్లను వెచ్చిస్తూ 841 చెరువులను పునరుద్ధరించుకోవడం జరిగిందని వివరించారు. పూడికతీత పనులతో చెరువుల్లో నీటి నిల్వ సామర్ధ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయన్నారు. దీంతో 986 చెరువులలో 18 కోట్ల రూపాయల విలువ చేసే చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా వదిలిందని తెలిపారు.

మరో ముప్పై జలాశయాల్లో ఆరు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ రొయ్య పిల్లలు విడిచిపెట్టడం జరిగిందని వివరించారు. ఇదివరకు 300 అడుగుల లోతు వరకు బోర్లు తవ్వినా నీరు వచ్చేది కాదని, ప్రస్తుతం అనేక చోట్ల 60 అడుగులకే నీళ్లు పడుతున్నాయని అన్నారు. నీటి సౌలభ్యం అందుబాటులోకి రావడంలో పంటల సాగు భారీగా పెరిగిందన్నారు. వరి పంట సాగులో దేశవ్యాప్తంగా 24 వ స్థానంలో ఉన్న తెలంగాణ, నేడు 2 వ స్థానాన్ని ఆక్రమించిందని తెలిపారు.

గత యాసంగిలో దేశవ్యాప్తంగా 94 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా, అందులో తెలంగాణ రాష్ట్రంలోనే 56 లక్షల ఎకరాలలో వరి పండిరచారని వివరించారు. ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే ప్రతి ఏటా సుమారు 2600 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం జరుగుతోందన్నారు.

కార్యక్రమంలో డీసీఓ సింహాచలం, భీంగల్‌ జెడ్పిటీసి రవి, ఎంపిపి మహేష్‌, చేయుట స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు మధుశేఖర్‌, గ్రామ సర్పంచ్‌ శంకర్‌, రైతు బంధు కమిటీల ప్రతినిధులు శర్మానాయక్‌, లింగం, జెడ్పి కో-ఆప్షన్‌ సభ్యుడు మోయిజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »