నిజామాబాద్, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిన్నటి రోజు ఎడపల్లి మండలంలో ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి తన సొంత గ్రామంలో 20, 30 పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించిందని, నిజానికి కవిత ఈ మధ్య లిక్కర్ స్కాంలో ఒత్తిడికి గురై జ్ఞాపకశక్తి లేక వాస్తవాలను మర్చిపోయిందేమో అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మా గ్రామం మా కుటుంబం అనే ఆలోచన చేయలేదని, ప్రతి గ్రామంలో అర్హులైన పేదవారికి ఇంట్లో ఇద్దరూ ఉంటే ఇద్దరికీ పెన్షన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కానీ టిఆర్‌ఎస్ నాయకులు వారి సొంత అనుచరులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే పనులు చేసుకుంటారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్బిన్ హంధాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణుతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కవిత కమిషన్ల కోసం తన సొంత ఊరులో ఉన్న సిమెంటు రోడ్లపైనే రోడ్లు వేసిందని, గ్రామాలలో పింఛన్ల ద్వారానే పరిస్థితులు మెరుగవుతాయనే ఆలోచనతో కాకుండా, ఉపాధి పనులు సాగునీటి రంగంలో పనులు జరిగినప్పుడే పరిస్థితి మెరుగవుతాయని భావించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని, ప్రజలకు పెన్షన్‌తో పాటు సాగునీరు, తాగునీరు అందే విధంగా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని, కవితకు సుదర్శన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి మధ్య ఉన్న తేడా ఉందని, సాగునీటి రంగంలో సుదర్శన్ రెడ్డి ఆల్లి సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, ఇతర ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు చేసి నియోజకవర్గాన్ని జిల్లాలో ఆదర్శంగా నిలిపారని అన్నారు.
సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడే ముందు కవిత ఆచితూచి మాట్లాడాలని మానాల మోహన్ రెడ్డి సూచించారు.అంతేకాకుండా పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కి చిన్న పదవి ఉందని కవిత మాట్లాడిరదని ఎందుకంటే కవితకు పదవుల విలువ తెలియదని, అప్పనంగా తండ్రి ఆశీస్సులతో ఎంపీ అయిందని మళ్లీ ప్రజలు ఓడిస్తే ఓడిపోయి ఎమ్మెల్సీ అయిందని, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ విద్యార్థి దశ నుండి పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఎదిగారని ఆయన అన్నారు. సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్‌ని విమర్శించే ముందు కవిత గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్బిన్ హమ్దాన్ మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి మచ్చలేని నాయకుడని, జిల్లాలో సాగునీటి రంగంలో నిజం సాగర్ ఆధునికరణ గాని, అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్,ఎన్నో రిజర్వాయర్లు నిర్మించిన వ్యక్తి అని ,వైద్య రంగంలో మెడికల్ కళాశాల గాని ఆయన చేసిన అభివృద్ధి గాని జిల్లా ప్రజలు మర్చిపోలేరని ఆయన అన్నారు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు చేయడం పాలకపక్షం పని అయితే దానిలో ఉన్న తప్పులను ఎత్తి చూపడం చూపించడం ప్రతిపక్షం యొక్క పని అని, ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారని గ్రహించి కాంగ్రెస్ నాయకుల పై అవాకులు చెవాకులు చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం ద్వారానే కెసిఆర్ సీఎం అయ్యాడని ఆయన అన్నారు. ఎడపల్లి మండలంలో 60సంవత్సరాలు నిండిన తెల్ల కార్డు ఉన్న ఎంతోమందికి కాంగ్రెస్ పార్టీ పెన్షన్లు ఇచ్చిందని, కానీ ఇప్పుడు టిఆర్‌ఎస్ పాలనలో 57 సంవత్సరాలు నిండిన ఎంతో మంది పెన్షన్ల అప్లికేషన్లు పెండిరగ్లో ఉన్నాయని, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లు రద్దు చేశారని, మైనారిటీలకు ఇప్పటివరకు లోన్లు ఇవ్వలేదని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసివేసి అందులో ఉన్న కార్మికులను రోడ్డున పడేసారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షుగర్ ఫ్యాక్టరీ కు ఉన్న 16 వేల ఎకరాల భూమిని పేదలకు పంచితే ఇప్పుడు టిఆర్‌ఎస్ ప్రభుత్వం వారికి ఉన్న హక్కులను కాల రాసిందని ఆయన అన్నారు. కాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వములో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు దేశంలో మారుమూల గ్రామాలలో కూడా వెళ్లిందని కాంగ్రెస్ పార్టీ అనేది టిఆర్‌ఎస్ పార్టీ లాగా కుటుంబ ప్రాంతీయ పార్టీ కాదని జాతీయ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీలో చిన్న డివిజన్ పదవి రావాలన్న ఎంతో కష్టపడాలని ఆయన అన్నారు. సుదర్శన్ రెడ్డి పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించే ముందు జిల్లా ప్రజలకు మీరు ఏమి చేశారో చెప్పాలని అన్నారు.
కవిత జిల్లాకు మహిళా కళాశాల తేలేదని, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేదని, యూనివర్సిటీ అభివృద్ధి కొరకు 100 కోట్లు ఇస్తానని ఇవ్వలేదని, తెలంగాణ యూనివర్సిటీలో అంతా గొడవ జరుగుతుంటే దానిని అదుపులో పెట్టలేదని ఆయన అన్నారు. సుదర్శన్ రెడ్డి సాగునీటి రంగంలో నిజం సాగర్ ను ఆధునికరించి జిల్లాకు నీళ్లు తీసుకువచ్చారని, వైద్యరంగంలో మెడికల్ కాలేజీని నిర్మిస్తే దానికి ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించడం లేదని, ఆసుపత్రిలో వైద్యులను నియమించడం లేదని, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు స్పెషల్ డ్రైవ్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
మహేష్ కుమార్ గౌడ్‌ని చిన్న పదవి అని కవిత మాట్లాడుతుంది అంటే అది ఆమె పుట్టిన సామాజిక వర్గం యొక్క అహాన్ని ప్రదర్శిస్తుందని, బీసీ నాయకుడైన మహేష్ కుమార్ గౌడ్ గారిని చిన్న పదవి అని కించపరుస్తూ బీసీలను కించపరుస్తూ మాట్లాడిన కవిత గారు జిల్లా బీసీ నాయకులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అల్లి సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్‌ను కవిత కుటుంబ సభ్యులే మెయింటైన్ చేస్తున్నారు అంటే డబ్బుల కోసం ఏమైనా చేస్తారని ఆయన అన్నారు. బీసీ నాయకుడైన మహేష్ కుమార్ గౌడ్‌ని కించపరుస్తూ మాట్లాడినందుకు కల్వకుంట్ల కవిత బీసీలందరికీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పా గంగారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా ఎన్‌ఎస్‌యుఐ అద్యక్షులు వేణు రాజ్, మాజీ బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు అంతి రెడ్డి రాజ రెడ్డి, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.