ఎక్కువమందికి పింఛన్లు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

కామారెడ్డి, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో అత్యధిక డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించిన ఘనత తనకే దక్కిందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు.

ఏ ఎమ్మెల్యే 11 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను మంజూరు చేయించలేదని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సహకారంతో 11 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను మంజూరు చేయించినట్లు చెప్పారు. వచ్చే జూలై నెలలో గృహ లక్ష్మీ పథకం కింద ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులకు రూ.మూడు లక్షలు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ నిధులు 100 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు.

మహిళ లబ్ధిదారుల పేరున బ్యాంకు ఖాతాలలో డబ్బులను జమ చేస్తామని పేర్కొన్నారు. ఇల్లులేని నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సొంత స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలను ఇస్తామని తెలిపారు. భారతదేశంలో ఎక్కువమందికి పింఛన్లు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో రైతు బంధు, బీమా వంటి పథకాలు లేవని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రైతులను రాజులుగా మార్చడానికి రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గర్భిణిగా ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ఒక పూట భోజనం, గుడ్డు, పాలు ఇస్తున్నట్లు తెలిపారు. గర్భిణులకు మూడు నుంచి ఆరు మాసాల వరకు కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం మైన మహిళలకు కెసిఆర్‌ కిట్టు పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. గర్భిణీలకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు.

బాలింతలకు కావలసిన వస్తువులు కిట్‌ ద్వార సమకూరుస్తున్నారని తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గాయని చెప్పారు. దేశంలో అతి తక్కువ మాతృ శిశు మరణాల రేటు కలిగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో ఉండటం కెసిఆర్‌ కిట్టు సాధించిన విజయంగా పేర్కొన్నారు. బీసీ కులాల వారు ఈనెల 20వ తేదీలోగా ఆన్లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా పది మందికి రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. బాన్సువాడ, వర్ని, కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రులలో అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గర్భిణీలకు ఎలాంటి సమస్యలు ఉన్న 102 టోల్‌ ఫ్రీ నెంబర్‌ కు కాల్‌ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 26న గిరిజనులకు పోడుపట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు, రైతుబంధు, భీమ వంటి పథకాలు పొందిన లబ్ధిదారులు వారి అభిప్రాయాలను ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటామని చెప్పారు. రాష్ట్రంలో 100 శాతం జనాభాలో 80 శాతం మంది పేద ప్రజలు ఉన్నారని తెలిపారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, ఆరోగ్య లక్ష్మి వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిందని చెప్పారు. నస్రుల్లాబాద్‌ మండలంలో 18,600 మంది ప్రజలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు.లి అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. నిరుపేద విద్యార్థులకు గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిందని చెప్పారు. వసతి గృహాల్లో ఉండి నిరుపేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలోనే బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రికి గుర్తింపు వచ్చిందని తెలిపారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, వైద్య సిబ్బంది కృషి వల్ల దేశస్థాయిలో గుర్తింపు లభించిందని చెప్పారు.

ముందుగా తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల త్యాగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని తెలిపారు. కళాకారులు తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు, రాష్ట్రం ఏర్పాటు కోసం చేసిన పోరాటాలపై పాటలు పాడి ప్రజలను ఆకట్టుకున్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ శోభ, డిసిసిబి చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »