నిజామాబాద్, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరం లో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెలంగాణ సాహిత్య దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ఖిల్లా జైలులోని స్మారక మందిరంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యులుకు నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు.
అనంతరం 10.00 గంటలకు న్యూ అంబేడ్కర్ భవన్ లో జిల్లా స్థాయి కవి సమ్మేళనం ఉంటుందని, సాయంత్రం 7.00 గంటలకు ముషాయిరా ఉంటుందని అన్నారు. కవి సమ్మేళనం, ముషాయిరాలో పాలుపంచుకునే కవులు, కవయిత్రులు మూడు పద్యాలను లేదా 20 పంక్తులను మించని వచన కవిత చదవవలసి ఉంటుందని కలెక్టర్ సూచించారు. సాహితీవేత్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.