కామారెడ్డి, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో భిక్కనూర్ గ్రామానికి చెందిన రాజమణి (45) కి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో పరిదీపేట్ గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల కేబీసీ రక్త నిధి కేంద్రంలో రక్తాన్ని అందజేయడం అభినందనీయమని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఓ,ఏ,బి,ఏబి నెగిటివ్ లకు సంబంధించిన రక్తం లభించడం చాలా ఇబ్బందితో కూడుకున్న పని అని ఈ రక్త గ్రూపులు కలిగిన రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడం వలన పేషంట్లకు కావాల్సిన రక్తం అందడం లేదని బండ రామేశ్వర్ పల్లి గ్రామంలో ఐవిఎఫ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతగా నిలిచిన అనిల్ రెడ్డికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు జీవన్, సంతోష్ పాల్గొన్నారు.