కామారెడ్డి, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేపలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతోందని జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యములో దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు చేపల ఉత్పత్తుల మేళా నిర్వహించారు. శనివారం ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ (చేప ఉత్పత్తుల మేళా ను) 3 రోజుల పాటు కొనసాగిందని తెలిపారు.
చేపలలో ఉండే ఒమేగా 3- ఫ్యాటీ హృదయాన్ని సురక్షితంగా ఉంచుతోందని చెప్పారు. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. మెదడు ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడతాయన్నారు. ఏ, డి, బి విటమిన్లు, జింకు, ఐరన్, అయోడిన్, సిలీనియం, కాలిషయం వంటి ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయని సూచించారు. రెడ్డి రాజయ్య జానపద కళాబృందం సభ్యులు కళాజాత ప్రదర్శన ద్వారా చేపలు తినడం వల్ల కలుగే లాభాల ను ప్రజలకు అవగాహన కల్పించారు.
మేళాను 3 రోజులపాటు దిగ్విజయంగా నిర్వహించారు. అద్భుత స్పందన వచ్చింది. చేపల ప్రియులు చేపలతో చేసిన రకరకాల వంటకాలను ఆరగించి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ ను ఇంకా ముందు ముందు ఎన్నో నిర్వహించాలని ప్రజలు కోరారు. 3 రోజుల కార్యక్రమం ముగింపు సందర్భంగా స్టాల్స్ లో చేపలతో రకరకాల వంటలలో ప్రతిభ చూపిన 5గురికి మెమొంటోలను, ప్రశంసా పత్రాలను జిల్లా మత్స్యశాఖ అధికారి కె. వరదారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారులు, సిబ్బంది, మత్స్యకారులు పాల్గొన్నారు.