సుపరిపాలనలో అందరికీ ఆదర్శం తెలంగాణ

నిజామాబాద్‌, జూన్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అందరికీ ఆదర్శంగా మారిందని వక్తలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం నిజామాబాద్‌ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ అధ్యక్షతన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు.

జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, నగర మేయర్‌ నీతూ కిరణ్‌ తదితరులు విచ్చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం పాలనాపరంగా చేపట్టిన మార్పులు, నూతన సంస్కరణలతో సాధించిన ఫలితాలు, క్షేత్ర స్థాయి వరకు ప్రజలకు చేరువైన పాలన, చేకూరుతున్న లబ్ది తదితర వివరాల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్‌ విఠల్‌ రావు మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో సామాన్య ప్రజానీకానికి పాలనను చేరువ చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికార వికేంద్రీకరణతో అద్భుత ఫలితాలు సాధించారని అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతూ, సుపరిపాలనకు మార్గదర్శకంగా మార్చారని కొనియాడారు. కులమతాలకు అతీతంగా అందరి సంప్రదాయాలను గౌరవిస్తూ అన్ని పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 8690 గ్రామపంచాయతీలు ఉండగా, అధికార వికేంద్రీకరణతో వాటి సంఖ్య 12769 కి పెరిగిందన్నారు. మండలాలు 464 నుండి 607 కు పెరిగాయని, పది జిల్లాలను 33 జిల్లాలు ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని వివరించారు. అభివృద్ధి, సంక్షేమ, సామాజిక కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని అన్నారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన సూక్తిని అక్షారాలా ఆచరిస్తూ తెలంగాణలోని ప్రతి పల్లెను పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, జీవన్‌ రెడ్డిలు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయాలు, ప్రభుత్వ ఉద్యోగుల కృషితో తెలంగాణ ప్రగతి పథాన అగ్రభాగాల్లో పయనిస్తుందన్నారు. రాష్ట్రంలో జోడెడ్ల బండిలా జోరుగా అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందని అన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శనికతతో సుపరిపాలన సాగుతోందని, సమైక్య రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఉండగా, స్వరాష్ట్రంలో తెలంగాణ సుభిక్షంగా మారిందన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు, సచివాలయం, నూతన కలెక్టరేట్‌ భవనాలు, రోడ్ల నిర్మాణాలు, చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటి సరఫరా, 24గంటల విద్యుత్‌ సరఫరా, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ వంటి పథకాలు, కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించిందని హర్షం వ్యక్తం చేశారు. దేశమే గర్వించే రీతిలో 120 అడుగుల ఎత్తుతో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాన్ని నెలకొల్పడం గర్వించదగ్గ విషయమని, నూతన సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం అన్నారు. దళితుల్లో ఆర్థిక అసమానతలు తొలగించేందుకే దళితబంధు పథకాన్ని ప్రారంభించారని అన్నారు.

గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా రూపొందించడం గొప్ప పరిణామమని, 2014కు ముందు తెలంగాణ ప్రాంతంలో కేవలం 60 లక్షల ఎకరాలు మాత్రమే సేద్యానికి నోచుకోగా , కోటిన్నర ఎకరాలు సేద్యానికి వచ్చిందంటే అది ముమ్మాటికీ సీఎం కేసీఆర్‌ ఘనతేనని కొనియాడారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కట్టి కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని గుర్తు చేశారు. బాగుపడిన చెరువులు చేతి వృత్తులకు ఊతమిస్తున్నాయని, మెరుగుపడిన శాంతి భద్రతలతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ సంస్థలన్నీ హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, సుపరిపాలన ఫలితంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం పెరిగినా, రాష్ట్రంలో సగటున పౌరుల తలసరి ఆదాయం వృద్ధి చెందిందని అన్నారు. అధికార వికేంద్రీకరణతో పాలనా సౌలభ్యం ఏర్పడిరదని, ప్రజలకు పాలన ఎంతో చేరువయ్యిందన్నారు. వివిధ శాఖల్లో కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేసుకునే వెసులుబాటు లభించిందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ధరణి, టీఎస్‌-ఐపాస్‌ వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.

ఆధునిక సాంకేతికతను ఉద్యోగులు అందిపుచ్చుకుని ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, సీపీఓ బాబురావు, టీఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »