ఆర్మూర్, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ వలస కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల నిబద్ధత, నాయకత్వ లక్షణాలను గుర్తించి మనోహరాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ పట్కూరి తిరుపతి రెడ్డిని గల్ఫ్ జెఏసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ తెలిపారు. శనివారం ఆర్మూర్ లో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు తిరుపతి రెడ్డికి నియామక పత్రం అందజేశారు.
ఎన్నో ఏళ్లుగా గల్ఫ్ కార్మికులు, పసుపు రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్న పట్కూరి తిరుపతి రెడ్డి గల్ఫ్ కార్మికుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ జెఏసి ప్రధాన కార్యదర్శి స్వదేశ్ పరికిపండ్ల కోరారు. ఈ సందర్భంగా పట్కూరి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ ప్రజలు గత యాభై ఏళ్లుగా గల్ఫ్ దేశాలకు ఉద్యోగం, ఉపాధి కోసం వెళుతున్నారని అన్నారు.
సురక్షితమైన, చట్టబద్దమైన వలసల కోసం అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తామని, హక్కుల కోసం పోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో క్రిష్ణ బొండ్ల, పరకాల విఠల్ గౌడ్, అంగొలి నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.