దశాబ్ది ఉత్సవాలకు అపూర్వ స్పందన

కామారెడ్డి, జూన్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దశాబ్ది ఉత్సవాలకు అపూర్వ స్పందన లభిస్తుందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం సుపరిపాలన సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలో గతంలో రెండు లైన్ల రోడ్లు ఉండగా వాటిని నాలుగు లైన్ల రోడ్లుగా మార్చామని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు మారుమూల గ్రామాల ప్రజలు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడే వారని చెప్పారు. కామారెడ్డి జిల్లా ఏర్పడడం ద్వారా మారుమూల గ్రామాల ప్రజలకు అందుబాటులో జిల్లా కేంద్రం ఉందని పేర్కొన్నారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. చేసే పని నిబద్ధతతో చేసినప్పుడు ఆత్మ తృప్తి కలుగుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు జిల్లాను మరింత అభివృద్ధి చేయడానికి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. రైతు దినోత్సవం, సాగునీటి దినోత్సవం, ఊరూరా చెరువుల పండగ, సంక్షేమ సంబరాలకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారని చెప్పారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. స్వరాష్ట్రంలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ప్రతి కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకమందని ఇల్లు లేదని, లబ్ధిదారుడు లేని కుటుంబం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీ ఏర్పాటు చేయడం వల్ల పాలన ప్రజల వద్దకు చేరువైందని తెలిపారు. జిల్లా ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసి రాష్ట్రంలో అన్ని రంగాల్లో జిల్లా మొదటి స్థానంలో నిలిచే విధంగా చూడాలని కోరారు. రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి అన్ని కులాలకు, మతాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.

జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ శోభ మాట్లాడారు. కొత్త జిల్లా ఏర్పాటు అయిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో భాగంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందని చెప్పారు.

జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. జిల్లాలో కార్పొరేట్‌ పాఠశాలల తరహాలో బీబీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల సముదాయం, భవానిపేట గ్రామపంచాయతీ భవనం నిర్మించారని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టే సఫాయి అన్న, సఫాయి అమ్మకు సన్మానం చేసి గౌరవించాలని పేర్కొన్నారు.

రాష్ట్రం ఏర్పడడం వల్ల 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. సమావేశంలో జెడ్పి వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌, బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా రెవెన్యూ కలెక్టర్‌ చంద్రమోహన్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »