నిజామాబాద్, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. ఆదర్శ హిందీ విద్యాలయ (హరిచరణ్ మార్వాడి) కళాశాలతో పాటు పద్మనగర్ లోని విశ్వశాంతి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు.
అభ్యర్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నపత్రాలను తెరిచారా? లేదా? అన్నది నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకుఅందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు.
జిల్లాలో 62 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 12 వేల 861 మంది అభ్యర్థులకు గాను 7 వేల 957 మంది హాజరయ్యారని, 4 వేల 904 మంది గైర్హాజరయ్యారని వివరించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లైజనింగ్ అధికారులు ఉన్నారు.