కామారెడ్డి, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 30,2023 నాటికి 18 ఏళ్ళు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు కోసం బిఎల్వో లకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో ఓటర్ల జాబితాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో వారానికి ఒకసారి రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఇంటింటికి బిఎల్వోలు వెళ్లి ఓటర్ల జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. తప్పులు ఉంటే దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు. మృతి చెందిన వ్యక్తుల పేర్లు ఉంటే తొలగించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం లోపు ఉండే విధంగా చూడాలన్నారు.
ఒక వ్యక్తి పేరు ఓటర్ల జాబితాలో ఒకే చోట ఉండే విధంగా చూడాలని పేర్కొన్నారు. రెండు చోట్ల ఉంటే ఒకచోట తొలగించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవోలు శ్రీనివాస్ రెడ్డి, శీను, రాజా గౌడ్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.