నిజామాబాద్, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్క ఓటరు నుండి కూడా ఫిర్యాదులు రాకుండా జాబితా పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా ఉండేలా పరిశీలన చేసుకోవాలని అన్నారు.
జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఇది ఎన్నికల ఏడాది అయినందున ఓటరు జాబితాను పునః పరిశీలించుకుని ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోవాలన్నారు. 2018 , 2019 ఎన్నికల సమయంలో ఓటరు జాబితాతో పోలిస్తే, ప్రస్తుతం ఎక్కడైనా ఓటర్ల సంఖ్య తగ్గినట్లైతే అందుకు గల కారణాలను పరిశీలించాలని, క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఇంటింటికి తిరిగి పరిశీలన జరిపే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
ఓటర్ల మార్పులు-చేర్పులకు సంబంధించి పెండిరగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, ఈ నెల 23 నాటికి ఇంటింటి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి పోస్టల్ శాఖ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు అందించే ప్రక్రియను కొనసాగించాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే ఈ.వీ.ఎంల ప్రాథమిక పరిశీలన ప్రక్రియ ఆయా జిల్లాలలో ప్రారంభమయ్యిందని గుర్తు చేశారు.
జూలై 01 నాటికి పరిశీలన ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని అన్నారు. పోలింగ్ స్టేషన్లు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని, తప్పనిసరిగా ర్యాంపులు ఏర్పాటు చేయించాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని గుర్తించాలని, ఎక్కడైనా అందుబాటులో లేని పక్షంలో ప్రత్యామ్నాయ చర్యలకు సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించేందుకు వీలుగా దశల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని చోట్ల పోలింగ్ శాతం పెరిగేలా చొరవ చూపాలని, ముఖ్యంగా గత ఎన్నికల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ పోలింగ్ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, తప్పుడు వదంతులు వ్యాపింపజేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా, ఎన్నికల నియమావళి తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలని, భద్రతా పరమైన ఏర్పాట్లపై దృష్టిని కేంద్రీకరించాలని వీ.సీలో పాల్గొన్న సందర్భంగా డీ.జీ.పీ అంజనీకుమార్ యాదవ్ పోలీస్ కమిషనర్లు, ఎస్పీ లకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ట్రైనీ అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులు డీఆర్‌డీఓ చందర్, జెడ్పి సీఈఓ గోవింద్, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు, సహాయ ఈ.ఆర్.ఓలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ తదితరులు పాల్గొన్నారు.