ఘనంగా తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం

నిజామాబాద్‌, జూన్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నియోజకవర్గస్థాయిలో తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్‌ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, ఆర్మూర్‌ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, స్థానిక మున్సిపల్‌ చైర్పర్సన్‌ వినీత పండిత్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వరాష్ట్ర సాధన అనంతరం వైద్య రంగంలో సాధించిన పురోగతి, చేపట్టిన విప్లవాత్మక మార్పులు, వివిధ వర్గాల ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వక్తలు వివరించారు. గర్భిణీల్లో రక్త హీనతను నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన న్యూట్రీషన్‌ కిట్‌ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో ఇక్కడి నుండే లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా బాలింతలకు కేసీఆర్‌ కిట్లు అందించారు. ఉత్తమ సేవలందించిన వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు బహూకరించి సత్కరించారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది కృషితో రాష్ట్రంలో వైద్యరంగం పురోభివృద్ధి సాధిస్తోందని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు అందించిన సేవలు అమోఘమని ప్రశంసించారు. ప్రభుత్వం అమలు చేసే ఏ కార్యక్రమమైనా, ఏ సంక్షేమ పథకమైనా పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యేందుకు ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు గణనీయంగా మెరుగుపడిన విషయాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడంతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. జిల్లాలో 65 మందికి కేసీఆర్‌ కిట్లు అందించామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేసుకున్న వారికి 72 కోట్ల రూపాయల నగదును ప్రభుత్వపరంగా ఇచ్చామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేకంగా మహిళల కోసం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు.

ప్రతి మంగళవారం మహిళలకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 8 వేల మంది పరీక్షలు జరిపించుకున్నారని వివరించారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 7 . 50 లక్షల మందికి నేత్ర పరీక్షలు చేసి, అవసరమైన వారికి కంటి అద్దాలు, నేత్ర చికిత్సలు చేశారని అన్నారు. సిబ్బంది కృషితోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం అధ్వాన్న స్థితిలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నేడు అత్యాధునిక హంగులతో పురోగమిస్తూ కార్పొరేట్‌ స్థాయిని మించిన వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. తెలంగాణలో వైద్య విప్లవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కర్మ,కర్త, క్రియ అని కొనియాడారు. తొమ్మిదేళ్లలోనే వైద్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఎదిగిందని జీవన్‌ రెడ్డి అన్నారు.

తల్లీ పిల్లల సంరక్షణ కోసం 14 రకాల వస్తువులతో ఇస్తున్న కేసీఆర్‌ కిట్‌ ఎంతో సత్ఫలితాలు అందించిందని తెలిపారు. 2014లో 30శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు, గత ఏప్రిల్‌ నాటికి 70శాతానికి చేరుకున్నాయన్నారు. బస్తీ దవాఖానల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో మూడు వేలకు పైగా పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తుండడం ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు. దేశంలో అత్యధిక కిడ్నీ మార్పిడులు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయని, కంటి వెలుగు ద్వారా కోటి 60లక్షల మందికి పరీక్షలు పూర్తి చేసి, 38 లక్షల మందికి కంటి అద్దాలు అందించడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన అధ్బుతమైన విజయమని అన్నారు.

స్వరాష్ట్రంలో మొట్ట మొదటి వంద పడకల ఆసుపత్రి ఆర్మూర్‌ కు కేటాయిస్తూ, రూ.27 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటికే 26 వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగాయని, దీంతో ప్రజలకు ఆర్థిక భారం తప్పిందని అన్నారు. కిడ్నీ పేషంట్ల కోసం ఆర్మూర్‌ లోనే డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని,ఆర్మూర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 26వేల మందికి పైగా అనారోగ్య బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక చేయూతనందించామని వివరించారు.

మరో 3 వేల మందికి ఎల్‌ వో సీలు ఇప్పించి మెరుగైన వైద్య సాయమందించామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్పర్సన్‌ పండిత్‌ వినీతా పవన్‌, వైస్‌ ఛైర్మన్‌ మున్ను భాయ్‌, కౌన్సిలర్లు, ఎంపిపిలు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »