నిజామాబాద్, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ భగీరథ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని, అధికారుల వేధింపులు ఆపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఐఎఫ్‌టియు, ఏఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ వద్ద గల మిషన్ భగీరథ ఎస్.ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఎస్.ఈకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, ఏఐటియుసి జిల్లా ప్రధానకార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తాగునీరు అందించే అద్భుత పదకంగా ప్రభుత్వం చెప్పుకుంటున్న మిషన్ భగీరథలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ కార్మికుల పట్ల కెసిఆర్ ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కాంటాక్ట్ కంపెనీల పైస్థాయి సిబ్బంది సైతం కార్మికులను అనేక రకాలుగా వేధింపులు గురిచేస్తున్నారని ఆరోపించారు.
మిషన్ భగీరథ కార్మికులకు జీవో నెం.60 ప్రకారం నెలకు స్కిల్ లేబరుకు 22 వేల 500, సెమీ స్కిల్ లేబరుకు 19 వేల 500, అన్ స్కిల్డ్ లేబరుకు 15 వేల 600 వేతనం ఇవ్వాలన్నారు. ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్‌ఐ, బోనస్ 8.33% అమలు చేయాలన్నారు. వారంతర సెలవు, జాతీయ, పండగల సెలవులు అమలు చేయాలన్నారు.
వాల్వ్ ఆపరేటర్లకు టి.ఎ. ఇవ్వాలన్నారు. పెండిరగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. 2021 సంవత్సరంలో పెండిరగులో ఉన్న రెండు నెలల వేతనం తక్షణమే విడుదల చేయాలన్నారు.
ప్రతినెల సకాలంలో వేతనాలివ్వాలని, 8 గంటల పనిని అమలు చేయాలనీ, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు సకాలంలో పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రగతీశీల మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలరాజు, పోశెట్టీ, తారాచంద్, మహిపాల్, అరుణ్, లింగం, రవి ఏఐటీయూసీ నాయకులు నర్సింగరావు, చక్రపాణి, హనుమన్లు, అనిల్, దేవేందర్, రమేష్,
పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి గణేష్, నగర అధ్యక్షులు అషుర్ యూనియన్ నాయకులు సందీప్, చంద్రకాంత్, గంగారం, ప్రశాంత్, ప్రవీణ్, సాయిలు, లింగం, సంతోష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.