ఆర్మూర్, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధికారులు, సిబ్బందితో పాటు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంతో ర్యాలీగా తరలివచ్చి పల్లె ప్రగతి దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామ పంచాయతీ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో గురువారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న, ఇంచార్జి ఎంపిడిఓ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.
గ్రామాలకు సమకూరిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు, మెరుగుపడిన మౌలిక వసతులు, సాధించిన ప్రగతితో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల వివిధ వర్గాల వారికి చేకూరిన లబ్ది గురించి వివరించారు. గ్రామస్థులతో కలిసి పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులను సందర్శించి పచ్చదనం, పరిశుభ్రతతో అలరారుతున్న పల్లెసీమల ముఖచిత్రాన్ని ప్రత్యక్షంగా చూపించారు.
గత తొమ్మిది సంవత్సరాల కాలంలో వివిధ కార్యక్రమాల కింద వెచ్చించిన నిధులు, చేపట్టిన పనుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు గ్రామ కూడళ్లలో ప్రదర్శిస్తూ పారదర్శక తీరుతో ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. పల్లెల పరిశుభ్రతలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సఫాయి కార్మికుల సేవలను కొనియాడుతూ సఫాయి అన్నా సలాం అన్న అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కార్మికుల గౌరవాన్ని ఇనుమడిరపజేశాయి.
ప్రగతి బాటలో పయనిస్తున్న గ్రామ పంచాయతీలు ఇప్పటికే జాతీయ, రాష్ట్ర స్థాయిలో సాధించిన అవార్డుల గురించి తెలియజేస్తూ, పల్లెల సమగ్ర ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సర్పంచ్ ఇందుర్ సాయన్న , ఎంపిడిఓ శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం చేస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు అరె రాజు, సొఖం నర్సయ్య, యువ న్యాయవాది సింధుకర్ చరణ్, గ్రామ సెక్రటరీ హరీష్. కారోబార్ మోహన్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.