నిజామాబాద్, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ దూరదృష్టి నిర్ణయాలు, దార్శనిక పాలనతో అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ పల్లెలు ప్రగతి వీచికలు వెదజల్లాయి. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో సంతరించుకున్న హంగులు, మారిన రూపురేఖలతో సరికొత్త వెలుగులు విరజిమ్మాయి.
స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని స్మరించుకుంటూ, ఆ స్పూర్తితో సాధించాల్సిన లక్ష్యాల వైపు మరింత ఉత్సాహంగా అడుగులు వేసేందుకు వీలుగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పల్లెల ప్రగతిని ఆవిష్కరింపజేశాయి. ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, బృహత్ పల్లెప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్ వంటి హంగులతో అలరారుతున్న పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రత నడుమ దశాబ్ది వేడుకకు వేదికలుగా నిలిచాయి.
దశాబ్ది సంబురాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గల 530 గ్రామ పంచాయతీలలో గురువారం నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమాలతో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపించింది. గ్రామ పంచాయతీలు, పల్లె ప్రకృతి వనాలు తదితర వాటిని మామిడాకులు, పూల తోరణాలతో అలంకరించారు. అందమైన రంగవల్లులతో పల్లెల్లోని వీధులు సాదరంగా స్వాగతం పలికాయి. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు నిశిత పర్యవేక్షణలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ విస్తృత ఏర్పాట్లు చేయడం పల్లె ప్రగతి సభల విజయవంతానికి దోహదపడిరది.
అధికారులు, సిబ్బందితో పాటు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంతో ర్యాలీగా తరలివచ్చి పల్లె ప్రగతి దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామ పంచాయతీల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధర్పల్లి లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొనగా, సాటాపూర్ లో బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమిర్, నందిపేటలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు భాగస్వాములయ్యారు.
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు సమకూరిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు, మెరుగుపడిన మౌలిక వసతులు, సాధించిన ప్రగతితో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల వివిధ వర్గాల వారికి చేకూరిన లబ్ది గురించి వక్తలు వివరించారు. గ్రామస్థులతో కలిసి పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులను సందర్శించి పచ్చదనం, పరిశుభ్రతతో అలరారుతున్న పల్లెసీమల ముఖచిత్రాన్ని ప్రత్యక్షంగా చూపించారు.
గత తొమ్మిది సంవత్సరాల కాలంలో వివిధ కార్యక్రమాల కింద వెచ్చించిన నిధులు, చేపట్టిన పనుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు గ్రామ కూడళ్లలో ప్రదర్శిస్తూ పారదర్శక తీరుతో ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. పల్లెల పరిశుభ్రతలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సఫాయి కార్మికుల సేవలను కొనియాడుతూ… సఫాయి అన్నా… సలాం అన్న అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కార్మికుల గౌరవాన్ని ఇనుమడిరపజేశాయి. ప్రగతి బాటలో పయనిస్తున్న గ్రామ పంచాయతీలు ఇప్పటికే జాతీయ, రాష్ట్ర స్థాయిలో సాధించిన అవార్డుల గురించి తెలియజేస్తూ, పల్లెల సమగ్ర ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు పిలుపునిచ్చారు.
పల్లెల పరిశుభ్రత, ప్రగతి కోసం విశేషంగా కృషి చేసిన మల్టీపర్పస్ వర్కర్ల సేవలకు గుర్తింపుగా వారిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే శానిటేషన్ విధులు నిర్వర్తిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్, పాదరక్షలు, గ్లౌజులు, నూనె, సబ్బులు వంటి వస్తువులతో కూడిన జూట్ బ్యాగులను పంపిణీ చేశారు.
హైదరాబాద్‌కు తరలివెళ్లిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులు
వివిధ అంశాల ప్రాతిపదికన జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన జీ.పీల సర్పంచులు జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ నేతృత్వంలో గురువారం ఉదయం హైదరాబాద్ కు తరలివెళ్లారు.
జిల్లా నుండి మొత్తం 27 మంది సర్పంచులు, ఇద్దరు లిమల్టీ పర్పస్ వర్కర్లులి ప్రత్యేక బస్సులో బయలుదేరివెళ్లారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వీరిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావుల చేతుల మీదుగా సన్మానించేందుకు హైదరాబాద్ కు ఆహ్వానించారు.