నిజామాబాద్, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరపాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు అన్ని విధాలుగా అభివృద్ధిని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మున్సిపల్ పట్టణం మెరీడియన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. ఒక్క భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు గడిచిన తొమ్మిది సంవత్సరాలలో 250 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేశామని వివరించారు. కేవలం 15 వేల జనాభా కలిగిన చిన్న మున్సిపాలిటీలోనే ఇంత పెద్ద మొత్తంలో నిధుల వెచ్చింపు జరిగిందంటే ప్రభుత్వం ఏ మేరకు సంక్షేమ అభివృద్ధికి పాటుపడుతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితమ్మ తోడ్పాటుతో ఇతర పట్టణాల కంటే భీంగల్ మున్సిపాలిటీకి తాను ఒకింత ఎక్కువ మొత్తంలోనే నిధులను మంజూరు చేయించానన్నారు. స్వరాష్ట్ర సాధనతోనే ఈ ప్రగతి సాధ్యపడిరదని, సమైక్య రాష్ట్రంలో ఎంతో మంది హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించినప్పటికీ భీంగల్ పట్టణం అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు అందుబాటులోకి తెస్తూ పురపాలికల రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కింద ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందన్నారు. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అందిస్తున్న నిధులకు సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుండడంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలవుతోందన్నారు. లేనిపక్షంలో సెంట్రల్ ఫైనాన్స్ నిధులు బల్దియాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకే సరిపోయేవని అన్నారు. దీనికితోడు భీంగల్ పట్టణానికి మున్సిపాలిటీ హోదా కల్పిస్తూ రూ. 20 కోట్ల నిధులను తమ ప్రభుత్వం మంజూరు చేయగా, ఎమ్మెల్సీ కవితమ్మ చొరవతో మరో ఐదు కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు.
ఈ నిధులతో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు వంటి పనులతో పాటు, ఓపెన్ జిమ్‌లు వంటివి ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ బంజారా భవన్, గ్రంథాలయం, కమ్యూనిటీ హాళ్లు, మహిళా భవనాలు, రూ. 35 కోట్లతో వంద పడకల ఆసుపత్రి, రూ. 3 కోట్లతో సమీకృత మార్కెట్ యార్డు, రూ. రెండు కోట్లతో 6 వైకుంఠ ధామాలు, రూ. 30 లక్షలతో మూడుచోట్ల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు జరిపించామన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోనే మొట్టమొదటగా భీంగల్ పట్టణంలో ఇంటింటికి రక్షిత మంచినీరు అందించామని మంత్రి గుర్తు చేశారు.
రూ. పది కోట్లతో కప్పల వాగుపై రెండు చెక్ డ్యామ్ లను నిర్మించడంతో భూగర్భ జలాలు వృద్ధి చెంది నీటి కొరత అధిగమించామని తెలిపారు. పాత అంగడి బజార్ లోని పోలీస్ స్టేషన్ స్థలంలో అర్బన్ పార్క్ త్వరలోనే అందుబాటులోకి రానున్నదని, సుమారు 228 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నెల రోజుల్లోపు అర్హులైన కుటుంబాలకు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. అభివృద్ధి పనులకు సమాంతరంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.
భీంగల్ పట్టణంలో ఆసరా పెన్షన్ల కింద ఇప్పటి వరకు 40.35 కోట్ల రూపాయలను పంపిణీ చేశామని, రైతు బంధు కింద సుమారు 12 కోట్ల రూపాయలను, రైతు బీమా కింద కోటీ 20 లక్షలు, గొర్రెల పంపిణీ పథకం కింద లబ్దిదారులకు 40.25 లక్షల రూపాయల మేరకు లబ్ది చేకూర్చామని తెలిపారు. ముఖ్యమంత్రి సాహాయ్య నిధి ద్వారా 353 మందికి కోటీ 68 లక్షలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా 677 మందికి 6.56 కోట్ల రూపాయలను అందజేశామని వివరించారు.
ఈ సందర్భంగా పట్టణ పరిశుభ్రతకు విశేషంగా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులనుద్దేశించి ‘సఫాయి అన్న నీకు సలాం…సఫాయి అమ్మా నీకు సలాం’ అంటూ మంత్రి సభాముఖంగా వందనాలు తెలియజేశారు. ఉత్తమ సేవలందించిన మున్సిపల్ సిబ్బందిని సన్మానించి, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, ఇంచార్జ్ కమిషనర్ రాజేందర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.