కరీంనగర్, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుబాయి, యూఏఈలో 16 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, అక్కడ మన గల్ఫ్ కార్మికుల కోసం చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి చిలుముల రమేష్‌ను గల్ఫ్ జెఏసి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ తెలిపారు. శుక్రవారం జగిత్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు రమేష్‌కు నియామక పత్రం అందజేశారు.
గల్ఫ్ వలస కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల రమేష్ కు ఉన్న నిబద్ధత, నాయకత్వ లక్షణాలను గల్ఫ్ జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వదేశ్ పరికిపండ్ల కొనియాడారు. ఈ సందర్భంగా చిలుముల రమేష్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ ప్రజలు గత యాభై ఏళ్లుగా గల్ఫ్ దేశాలకు ఉద్యోగం, ఉపాధి కోసం వెళుతున్నారని అన్నారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసల కోసం… అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తామని, హక్కుల కోసం పోరాటం చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో గల్ఫ్ జెఏసి రాష్ట్ర కార్యదర్శి బూత్కురి కాంత, దుబాయిలో ప్రముఖ సోషల్ వర్కర్ ఉట్నూరి రవి, దుబాయి ఎల్లాల శీనన్న సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, నరసింహునిపేట సర్పంచ్ బాబు స్వామి, ఇంజపురి తిరుపతి, బడుగు ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.