మంచినీటి ఎద్దడిని తీర్చిన ఘనత కెసిఆర్‌దే

కామారెడ్డి, జూన్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డి జిల్లాలో మల్లన్న గుట్ట సమీపంలో ఉన్న మిషన్‌ భగీరథ ప్రాజెక్టు వద్ద తెలంగాణ మంచినీళ్ల పండగ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మాట్లాడారు. మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో, జిల్లాలో మంచినీటి ఎద్దడిని శాశ్వతంగా తీర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కే దక్కుతుందని అన్నారు.

గ్రామాల్లోని ప్రజలు సురక్షితమైన నీటిని తాగడం వల్ల వ్యాధులు రావడంలేదని తెలిపారు. గతంలో తెలంగాణ రాకముందు తాను ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు రోడ్డుకు అడ్డంగా బిందెలు పెట్టి నీటి ఎద్దడిని తీర్చాలని ఆందోళన చేపట్టే వారు అని చెప్పారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో నీటి కోసం మహిళలు ఇబ్బందులు పడవద్దని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆలోచించి ఇంటింటికి మంచినీటిని అందించారని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి శాశ్వతంగా పరిష్కారం జరిగిందని తెలిపారు. నిజాయితీగా ఉన్నామని, పలు రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు.

పేదల, రైతుల, మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ మాట్లాడారు. తెలంగాణ రాకముందు మహిళలు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్లుని, కరెంటు సమస్య ఉంటే ఇబ్బందులు పడే వాళ్ళని తెలిపారు. తాడ్వాయి మండలంలో నీటి ఎద్దడి అధికంగా ఉండేదని చెప్పారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో సందర్భంగా మంచినీళ్ల పండగ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. తాగునీటిని వృధా చేయవద్దని సూచించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పారు. వేసవిలో సైతం జిల్లాలో అన్ని గ్రామాల్లో తాగునీరు పుష్కలంగా లభిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, ఆర్డబ్ల్యూఎస్‌ ఈఈ లక్ష్మీనారాయణ, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

మిషన్‌ భగీరథ ప్రాజెక్టును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళలు సందర్శించారు. శ్రీరామ్‌ సాగర్‌ నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా అధికారులు వివరించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »