కామారెడ్డి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్, పతాంజలి యోగసమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని యోగభవనంలో బుధవారం ఉదయం తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా ఎస్పీ మాట్లాడారు.
ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే యోగ ఉత్తమమైన సాదనం అన్నారు. మానవులు ఉదయం లేవగానే మంచి ఆలోచనలు రావడానికి యోగా దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ యోగాసనాలు చేయడం వల్ల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని తెలిపారు. ఎలాంటి వ్యాధులు దరిచేరవని సూచించారు. 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, పాటల పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కే. శ్రీనివాసరావు, యోగ గురువులు అంజయ్య, రామ్‌రెడ్డి, అనిల్ కుమార్, అంతిరెడ్డి వివిధ రకాల ఆసనాలు చేశారు.
కామారెడ్డి పట్టణంలో ఉచితంగా యోగ శిక్షణ ఇచ్చిన గురువులకు ఈ సందర్భంగా శాలువలతో సన్మానించారు. జిల్లా టీఎన్జీవో ఎస్ అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి బి. సాయిలు, జిల్లా యోగ అసోసియేషన్ ప్రతినిధులు రఘు కుమార్, అంజయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.