అమరుల త్యాగఫలితమే తెలంగాణ

నిజామాబాద్‌, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలు స్మరించుకోవడానికే తెలంగాణ సంస్మరణ దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలో తెలంగాణ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త, నగర మేయర్‌ దండునీతూ కిరణ్‌, అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, అధికారులు హాజరయ్యారు.

కార్యక్రమం ప్రారంభానికి ముందు అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం త్యాగం చేసిన వారి కుటుంబాలను గౌరవించుకోవడం కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలోని అన్ని స్థానిక సంస్థలు అయిన గ్రామ, మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి తెలంగాణ అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారన్నారు.

తెలంగాణ అమరవీరులను కచ్చితంగా సన్మానించుకోవాలని వాళ్ళ త్యాగాల ఫలితంగానే తెలంగాణ సిద్దించిందని కలెక్టర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లాలో 32 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నగదు అందించామని 30 మందికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామన్నారు. మరో ఇద్దరి కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వనున్నామన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 21 రోజుల పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించామన్నారు.

గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అమరువీరుల కుటుంబాల త్యాగాలు మరువలేనివన్నారు.

అమరవీరుల కుటుంబాలను కేసీఆర్‌ ఆదుకుంటున్నారు : జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విఠల్‌ రావు

తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదుకుంటున్నారని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విఠల్‌ రావు అన్నారు. 2001 నుంచి కేసీఆర్‌తో అడుగులో అడుగు వేసి ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. ఉద్యమంలో అనేక ప్రాంతాలు తిరిగి తెలంగాణ ఆవశ్యకత గురించి వివరించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు 42 రోజుల పాటు సకల జనుల సమ్మె, 90 రోజుల పాటు సహాయ నిరాకరణ చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల సహకారంతో తెలంగాణ సాధించి కేసీఆర్‌ 9 ఏళ్లలో ఎంతో అభివృద్ది సాధించామన్నారు.

అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ : అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త

తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్ళలో సాధించిన ప్రగతిని దశాబ్ధి ఉత్సవాల్లో వివరించాలని కేసీఆర్‌ సూచించారన్నారు. అయితే ముగింపు దినోత్సవాన్ని మాత్రం తెలంగాణ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోయిందనే బాధతో శ్రీకాంతచారి ఆత్మబలిదానం చేసుకున్నారన్నారు.

నిజామాబాద్‌ నగరంలో 8 మంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారన్నారు. వారి లోటు మరువలేనిదని వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల నగదు అందజేసి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న జాతీయ జండా ఆవిష్కరించిన రోజు అమరుల కుటుంబాలను సన్మానించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప ఆలోచనతో అమరవీరులకు హైదరాబాద్‌లోని సెక్రటేరియల్‌ ఎదురుగా బ్రహ్మండమైన స్థూపం నిర్మించడం జరిగిందన్నారు. సెక్రటేరియట్‌ లో పని చేసే అధికారులు, ఉద్యోగులు ఆ స్థూపాన్ని చూస్తూ తెలంగాణ అభివృద్ది కోసం పని చేయాలనే తపన ఉంటుందని నిర్మించారన్నారు. భారతదేశంలో ఎక్కడ ఇలాంటి స్థూపం ఉండదన్నారు.

తెలంగాణ సంస్మరణ దినోత్సవంకు సంపూర్ణత చేకూరింది : నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌

తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం సంపూర్ణత చేకూరిందని నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అడుగడుగునా జరిగిన అన్యాయాలు, వివక్షతలు గురయ్యామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ ముందుండి నడిపి తెలంగాణ సాధించుకున్నామన్నారు.

తెలంగాణ సంస్మరణ దినోత్సవంలో తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవడం , వారి కుటుంబాలను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమం అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులతో కలెక్టర్‌, ఎమ్మెల్యే, మేయర్‌, అధికారులు సహంపక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ రజిత యాదవ్‌, నూడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »