దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు

కామారెడ్డి, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహింస విధానంలో మలి విడత తెలంగాణ ఉద్యమం ఉద్యమ నేత కేసిఆర్‌ శాంతియుతంగా పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జెడ్పి సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమరవీరుల ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు.

అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. ప్రతి ఒక్కరు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ రంగాలలో దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. 2014 జూన్‌ 2 కన్న ముందు రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, రాష్ట్ర ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన తర్వాత పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారని చెప్పారు.

జిల్లాలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు వేడుకలు ఏర్పాటుచేసి సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారని పేర్కొన్నారు. జిల్లాలో దశాబ్ది వేడుకలకు ప్రజల నుంచి అపూర్వస్పందన లభించిందని తెలిపారు. ఉద్యమ నాయకుడు కెసిఆర్‌ స్వరాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి రావడం గొప్ప విషయమని కొనియాడారు. జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంలో పని చేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందని చెప్పారు. అమరవీరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందని పేర్కొన్నారు.

రాజ్యాంగబద్ధమైన తెలంగాణ రాష్ట్ర సాధన, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం, అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ధైర్య సాహసాలు ప్రదర్శించారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అమరవీరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఏర్పాటు చేసిందని చెప్పారు.

ఈ సందర్భంగా జెడ్పి సర్వసభ్య సమావేశంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరవీరుల సంస్మరణ తీర్మానాన్ని జెడ్పీ చైర్‌ పర్సన్‌ శోభ సభ్యులకు తెలిపారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 17 అమరవీరుల కుటుంబాలకు ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేసి శాలువాలతో సన్మానించారు. సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, జెడ్పి సీఈవో సాయా గౌడ్‌, జడ్పిటిసి సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »