నిజామాబాద్, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, మేయర్ దండు నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా అమరులకు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజులో భాగంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణ అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ అమరుల స్థూపంకు నివాళులు అర్పించామన్నారు. లోకల్ బాడి సమావేశాలు నిర్వహించి గ్రామ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి అమరుల త్యాగాలను స్మరించుకుంటామన్నారు. జిల్లాలోని పాఠశాలలో అమరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరుగుతుందన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమరులను స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులకు సన్మానించడం జరుగుతుందన్నారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు గత 21 రోజులుగా సాగుతున్నాయన్నారు. అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ లోని సెక్రటేరియట్ ఎదుట అమరుల చిహ్నాన్ని ఏర్పాటు చేశారన్నారు. తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ సాధించుకున్న విజయాలను గుర్తు చేస్తుకోవాలన్నారు.
2014 కంటే ముందు ప్రస్తుతం తెలంగాణ లో జరిగిన అభివృద్ధిని గుర్తించాలన్నారు. దసరా, దీపావళి పండుగలు ఒక రోజు మాత్రమే వస్తుందని కానీ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సావాలు 22 రోజుల పాటు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.