కామారెడ్డి, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూలై 1న జరిగే గ్రూప్ – 4 పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం గ్రూప్ -4 పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. జిల్లాలో 40 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 9 రూట్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రూట్ ఆఫీసర్స్, లైజనింగ్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్లు పరీక్ష సజావుగా జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు మీడియం విద్యార్థులకు ప్రత్యేక గదులు కేటాయించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లవద్దని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, ఏవో రవీందర్, పరీక్షల విభాగం అధికారి లింగం, అధికారులు పాల్గొన్నారు.