కామారెడ్డి, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి సాగు చేసిన వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గంజాయి సాగు చేసిన వ్యక్తులకు రైతుబంధు, బీమా, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నిలిపివేస్తామని తెలిపారు.
ఎక్కడైనా గంజాయి సాగు చేస్తే ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు. డ్రగ్స్ వాడటం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. గంజాయి సాగు చేసినట్లు కనిపిస్తే వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి అక్రమంగా రవాణా చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీంద్ర రాజు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.