నిజామాబాద్, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత పూర్వ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు తన దార్శనికతతో భారతదేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్ది భావి భారతానికి బంగారు బాటలు వేశాడని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. కేర్ డిగ్రీ కళాశాలలో బుధవారం పివి నరసింహారావు జయంతిని నిర్వహించారు.
కార్యక్రమంలో మాట్లాడుతూ పీవీ నరసింహారావు బహుభాషా వేత్తగా సాహిత్య సృజన శీలిగా, అనువాదకుడిగా, రాజనీతిజ్ఞునిగా, అధునాతన రాజకీయ నాయకునిగా, ఆర్థిక చోధకునిగా దేశ సేవ చేశారని ఆయన నాయకులందరికీ స్ఫూర్తి అని నివాళి అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు రాజకీయాలకు హుందాతనం నేర్పారని, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన వజ్రసముడని వివరించారు.
ప్రముఖ కవి పంచ రెడ్డి లక్ష్మణ మాట్లాడుతూ పీవీ నరసింహారావు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉండేవాడని ఢల్లీి గద్దె ఎక్కిన తెలంగాణ బిడ్డగా తన ప్రత్యేకతను ఎన్నడూ విలువ లేదని తెలిపారు. ప్రముఖ కవి తిరుమల శ్రీనివాస్ ఆర్య మాట్లాడుతూ పివీ నరసింహారావు తెలంగాణ ఠీవీ అని, ఆయన రాసిన గొల్ల రామవ్వ కథ ఆయన సామాజిక దృక్పథానికి ప్రతీక అని కొనియాడారు. కార్యక్రమంలో నరేశ్, సందీప్, సందేశ్ తదితరులు పాల్గొన్నారు.