ప్రశాంతంగా గ్రూప్‌-4 పరీక్ష

నిజామాబాద్‌, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా శనివారం జరిగిన గ్రూప్‌-4 పరీక్ష నిజామాబాద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల, కాకతీయ జూనియర్‌ కాలేజ్‌ లలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ గూపన్‌ పల్లిలో గల శ్రీ చైతన్య హైస్కూల్‌లోని ఎగ్జామ్‌ సెంటర్‌ ను సందర్శించారు.

అభ్యర్థుల హాజరు గురించి పరీక్షా కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగ్జామ్‌ హాల్లోకి క్యాలిక్యులేటర్‌, సెల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెయిన్‌ గేట్‌ ల వద్దే క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. జిల్లాలో సగటున 82 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్‌ తెలిపారు. మొత్తం 39 వేల 174 మంది అభ్యర్థులకు గాను ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగిన మొదటి సెషన్‌ పేపర్‌-1 పరీక్షకు 32 వేల 342 మంది (82.55 శాతం) హాజరయ్యారని, తిరిగి మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పేపర్‌-2 కు 32255 మంది (82.34 శాతం ) హాజరయ్యారని వివరించారు.

కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఆయా రూట్ల వారీగా ప్రశ్న పత్రాలు, ఇతర సామాగ్రిని ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించారు. టీ ఎస్‌ పీ ఎస్‌ సి నిబంధనలను అనుసరిస్తూ నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేశారు. అభ్యర్థుల సౌకర్యార్ధం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి పరీక్షా సమయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్‌ ను అమలు చేస్తూ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష ముగిసిన అనంతరం అభ్యర్థుల ఓ.ఎం.ఆర్‌ షీట్లు, ఇతర సామాగ్రిని నిబంధనలకు అనుగుణంగా సీల్‌ వేసి పోలీస్‌ ఎస్కార్ట్‌ నడుమ స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు.

ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌ క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో చర్యలు తీసుకున్న దరిమిలా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, సజావుగా గ్రూప్‌-4 పరీక్షలు ముగిసాయి. కలెక్టర్‌ సూచనల మేరకు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల వద్ద అభ్యర్థులకు సహాయంగా హెల్ప్‌ డెస్క్‌ లను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద సమగ్ర వివరాలను, పాటించాల్సిన నిబంధనలను క్షుణ్ణంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అభ్యర్థులకు ఎంతో ఊరటను అందించింది. కలెక్టర్‌, అదనపు కలెక్టర్ల వెంట పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, లైజనింగ్‌ అధికారులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »