కామారెడ్డి, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కెవిఆర్ గార్డెన్ లో ఆదివారం గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాలను గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
గిరిజనులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యా అవకాశం లభించిందన్నారు. తండాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తండాలో మార్పు కనిపిస్తుందని చెప్పారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. వందల ఏళ్లుగా గిరిజనులు అటవీ సంపదను కాపాడుకుంటూ వచ్చారని తెలిపారు. ప్రభుత్వం అర్హత గల గిరిజనులకు పోడు భూములను పంపిణీ చేసిందని చెప్పారు.
గిరిజనులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా మార్చాలని కోరారు. ఈ సందర్భంగా 668 మంది లబ్ధిదారులకు 1668 ఎకరాలు పోడు భూమి పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, ఎంపీపీ నర్సింగ్ రావు, జెడ్పిటిసి సభ్యుడు రామ్ రెడ్డి, రామారెడ్డి ఎంపీపీ దశరథ్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల గిరిజనులు పాల్గొన్నారు.