కామారెడ్డి, జూలై 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పాఠశాలలలో మౌలిక సదుపాయాలని కల్పించాలని నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లిటిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పర్లపల్లి రవీందర్, డాక్టర్ బాలు, జనపల కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అత్యధిక బడ్జెట్ కలిగిన రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటని పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల పట్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడమే కానీ పేద ప్రజలకు ఉపయోగపడే విద్యా, వైద్య సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
రానున్న రోజుల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి తరిమికొడితేనే న్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ నియామకాలు భర్తీ చేయాల్సి ఉండగా వాటికి సంబంధించిన ప్రక్రియకు ఇప్పటివరకు ముందుకు రాకపోవడం ఈ ప్రభుత్వానికి పేద విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా కనబడుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ అంజల్ రెడ్డి నాయకులు సతీష్, సందీప్ రాజు, నవీన్, ప్రవీణ్, పరుశురాం, సచిన్, రవి, మహిపాల్, మణిదీప్ శ్రావణ్ పాల్గొన్నారు.