కామారెడ్డి, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాఖల వారిగా ఇచ్చిన హరితహారం లక్ష్యాలను ఈనెల 15లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో హరితహారం లక్ష్యాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అన్ని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలని తెలిపారు.
ప్రభుత్వ స్థలాలు లేని మండలాల్లో అటవీ భూముల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉపాధి హామీ, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. రోడ్ల వెంబడి మొక్కలు లేక పోతే అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోని ఖాళీ స్థలాలలో మొక్కలు నాటే విధంగా చూడాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల ఆవరణలో ఖాళీ స్థలం ఉంటే కరివేపాకు, ఉసిరి, చింత, మునగ, వెలుగ వంటి మొక్కలు పెంచాలని సూచించారు. మొక్కలు నాటడానికి వివిధ శాఖల అధికారులు పోటీపడాలని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఐదు మొక్కలు పంపిణీ చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఎఫ్‌ఓ నిఖిత, డిఆర్డిఓ సాయన్న, అధికారులు పాల్గొన్నారు.