కామారెడ్డి, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 20న నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నేషనల్ డివార్మింగ్ డే పై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడారు.
1 నుంచి 19 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరికి నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని తెలిపారు. ఈనెల 19 గ్రామాల్లో అంగన్వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో నులిపురుగుల నిర్మూలనపై అవగాహన కల్పించాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, అన్ని శాఖల అధికారులు నులిపురుగుల నివారణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. నులి పురుగు మాత్రలు వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు.
మహిళా సంఘాల సభ్యులకు మెప్మా, ఐకెపి అధికారులు నులిపురుగుల నివారణ పై అవగాహన చేయించాలని తెలిపారు. మిగిలిపోయిన పిల్లలకు ఈనెల 27న నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రల ప్యాకెట్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, అనిల్ కుమార్, వెంకటేశ్వర్ గౌడ్, నాగేందర్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.