నిజామాబాద్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం సమ్మె ప్రారంభించారు. సమ్మెను ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పెండిరగ్లో ఉన్న తొమ్మిది నెలల బకాయి బిల్లులు, 18 నెలల కేసీఆర్ పెంచిన వేతనాలు చెల్లించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు కోడిగుడ్లను, వంట సామాగ్రిని, గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని ఆందోళన నిర్వహిస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించకపోగా కొత్త మెనూ పేరుతో కార్మికులపై మోయలేని భారాన్ని మోపుతున్నారని అన్నారు.
తొమ్మిది నెలల బకాయి బిల్లులు రాకపోవడంతో కార్మికులు అప్పుల పాలయ్యారని, ఆస్తులు అమ్ముకుంటున్నారన్నారు. ప్రైవేటు కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించే ప్రభుత్వం పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన కడుపునిండా భోజనం పెడుతున్న కార్మికుల బిల్లును చెల్లించకపోవడం దుర్మార్గం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు రావాల్సిన బకాయి బిల్లులు చెల్లించడంతోపాటు, బకాయి వేతనాలు ఇతర సమస్యలను పరిష్కరించాలని అప్పటివరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు పిన్నెల హనుమాన్లు, కండ్లకోయ గంగాధర్, అలీ ఇమ్రాన్, సాయమ్మ, లావణ్య, లక్ష్మి, చంద్రకళ, మంజుల, రజియా బేగం కార్మికులు తదితరులు పాల్గొన్నారు.