కామారెడ్డి, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జులై 15 నుంచి బీసీ కుల వృత్తులకు ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులకు ఆర్థిక సహాయం పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
లిబీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. బీసీ కులవృత్తులు, చేతి వృత్తులను సంరక్షించేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. కుల వృత్తులు చేతివృత్తులు చేసుకునే వారికి ప్రోత్సాహం అందిస్తే ఎదుగుతారనేఉద్దేశంతో లక్ష రూపాయలు గ్రాంట్ అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఈ పథకాన్ని జూన్ 9వ తారీఖున సీఎం కేసీఆర్ లాంచనంగా ప్రారంభించారని మంత్రి పేర్కొన్నారు.
జూన్ 20 వరకు బీసీ కుల వృత్తులకు ఆర్థిక సహాయం కోసం 5 లక్షల 28 వేల దరఖాస్తులు స్వీకరించామని, వీటిలో నుంచి అర్హులైన ప్రతి లబ్దిదారుడికి సహాయం అందే వరకు ఈ పథకం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. జూలై మాసంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 300 మందికి జూలై 15 నుంచి లక్ష రూపాయలు చెక్కుల పంపిణీ చేయాలని మంత్రి సూచించారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 50 మంది లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తుంది, కొన్ని వర్గాల వారికి మాత్రం వస్తుందని అసంపూర్తి వార్తలు ప్రచారంలో ఉన్నాయని, ఇవి ఏ మాత్రం వాస్తవం కాదని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు. బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని, చివరి లబ్దిదారుడికి సహాయం అందే వరకు ప్రతి నెలా చెక్కుల పంపిణీ ఉంటుందని మంత్రి తెలిపారు.
బీసి కులవృత్తుల, చేతి వృత్తుల కింద దరఖాస్తు చేసుకున్న వారిలో దారిద్య్రరేఖ దిగువన ఉన్న వారందరికి దశల వారీగా పథకం అమలవుతుందని, ప్రతి నెల లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు. జులై 15 నుంచి బీసీ కుల వృత్తులకు, చేతి వృత్తుల చెక్కుల పంపిణీ కార్యక్రమం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే సమక్షంలో ప్రారంభించాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ సహాయం అందుకున్న లబ్దిదారుల వారికి నచ్చిన చోట అవసరమైన పరికరాలు కొనుగోలు చేసి కులవృత్తి చేసుకోవచ్చని, నెల రోజుల లోపు అధికారులు సదరు లబ్దిదారుని యూనిట్ వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని మంత్రి తెలిపారు.
లిబీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం మాట్లాడారు, బీసీ కుల వృత్తుల ఆర్థిక సహాయం పథకం కింద దరఖాస్తు చేసుకున్న 5.28 లక్షల అభ్యర్థులలో 15 కుల వృత్తుల, చేతి వృత్తుల వారికి మొదటి ప్రాధాన్యం అందించాలని, ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను జిల్లా ఇంఛార్జి మంత్రిచే ఆమోదింప చేసుకొని జూలై 15 నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించాలని అన్నారు. ప్రతి నెల చెక్కుల పంపిణీ ఉంటుందని, జూలై మాసంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 300 మంది లబ్ధిదారులకు పథకం అమలవుతుందని తెలిపారు.
బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం కోసం వచ్చిన ఏ దరఖాస్తును తిరస్కరించడం లేదని, దారిద్య్ర రేఖ దిగువన ఉన్న వారందరికి దశల వారీగా పథకం వర్తింపజేయాలని ప్రభుత్వంనిర్ణయించిందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. బీసీలబ్ధిదారులు ఎంపిక శుక్రవారం పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. దశలవారీగా అర్హత గల వారందరికీ ఆర్థిక సాయం అందుతుందని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా బీసి అభివృద్ధి అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.