దాశరథి జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఖిల్లా జైలులో దాశరథి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా తదితరులతో కలిసి రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు.

దాశరథిని రాజకీయ ఖైదు చేసిన ఖిల్లా జైలును సందర్శించి, జయంతి ఉత్సవాల వేదిక, ఇతర ఏర్పాట్లపై స్థానిక అధికారులతో సంచాలకులు హరికృష్ణ చర్చించారు. అందరినీ ఆకర్షించేవిధంగా జయంతి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. దాశరథి, ఆళ్వారుస్వామి తదితరుల సాహిత్యం ప్రతిబింబించేలా ఫ్లెక్సీలు, విద్యుద్దీపాలు, రంగులతో ప్రాంగణమంతా ఆకట్టుకునేలా అందంగా అలంకరించాలన్నారు. దాశరథిని జైలులో నిర్బంధించిన ఆనాటి పరిస్థితులు గుర్తు చేసేవిధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు.

ఖిల్లా ప్రవేశ ద్వారం నుండి జైలు పైభాగం వరకు అన్ని ప్రాంతాలను అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. ఖిల్లా కోట పైకి వెళ్లే రహదారులను శుభ్రం చేయాలని, ఖిల్లా రామాలయం పాత కల్యాణ మండపాన్ని మరమ్మతులు చేసి, ఆలయ ప్రాంగణాన్ని పూల కుండీలతో సుందరీకరణ పనులు చేపట్టాలని, దాశరథిని నిర్బంధించిన జైలు బ్యారక్‌ ను ప్రజలు సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఉదయం నుండి రాత్రి వరకు కూడా కార్యక్రమాలు కొనసాగే అవకాశాలు ఉన్నందున సరిపడా లైటింగ్‌ ఏర్పాటు చేయించాలని, ఖిల్లా జైలు ప్రాంగణంలోని దీపస్తంభంను అలంకరించి జ్యోతి ప్రకాశనం చేయాలన్నారు.

జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వేయి మంది కళాకారులతో నగరంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో కవులు, రచయితలు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా కళాకారుల ర్యాలీ కొనసాగనున్న గోల్‌ హనుమాన్‌ చౌరస్తా నుండి పెద్ద బజార్‌, వాటర్‌ ట్యాంక్‌, గురుద్వార్‌, గాజులపేట్‌ మీదుగా ఖిల్లా వరకు గల రహదారిని పరిశీలించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్న దృష్ట్యా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. సంచాలకులు హరికృష్ణ వెంట నిజామాబాద్‌ ఆర్డీఓ రవి, ఇంచార్జ్‌ జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి సింహాచలం, నార్త్‌ తహసీల్దార్‌ సుదర్శన్‌, మున్సిపల్‌ ఏ.ఈ ఇనాయత్‌, భారత జాగృతి సంస్థ రాష్ట్ర కార్యదర్శి నవీనాచారి, జిల్లా ప్రతినిధులు అవంతిరావు, నరాల సుధాకర్‌ తదితరులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »