జుక్కల్, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం జుక్కల్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. గ్రామపంచాయతీ కార్మికులకు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ సంఫీుభావంగా కండ్లకు నల్ల గుడ్డ కట్టుకొని పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ గొండ కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ కార్మికులు తమ గ్రామాలలో గ్రామాన్ని పరిశుభ్రపరుస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పనిలో ఉన్నారని, కార్మికులకు కనీస వేతనం అమలు కాకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం విచారకరమన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి సేవలు వినియోగించుకుంటూ బెస్ట్ వారియర్స్ అని సన్మానించిన మాత్రాన వీరి బతుకులు మారవన్నారు. కనీస వేతనం 19 వేల 500 రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యంతో పాటు ఆరోగ్య కార్డులు, రెండు జతల యూనిఫామ్ బట్టలు, ప్రతినెల వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే కార్మిక నాయకులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి సురేష్ గొండ డిమాండ్ చేశారు.
ఆలస్యమయితే వర్షాకాలం కావున సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున వీరి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి విధులకు తీసుకోవాలని, లేనిచో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు చేపట్టే దశల వారి పోరాటానికి సిఐటియు అన్ని విధాలుగా మద్దతుగా ఉంటారని కార్మికులకు సురేష్ గొండ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు వీరయ్య, మారుతి, సంజు, రమేష్, అస్సు ఖాన్, జాఫర్, గంగారం, సోపన్, బలరాం, రాములు, కేరళ, శంకర్, కారోబర్లు, విట్ట గౌడ్, గంగాధర్, జ్ఞానేశ్వర్, గంగారం, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.