కామారెడ్డి, జూలై 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై సమీక్షా సమావేశం 2023 – అవగాహన, ఈ.వి.ఎం.లు, వి.వి. ప్యాట్ ల ఉపయోగం కోసం డిజిటల్ ఔట్రీచ్ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీడియో సమావేశంలో స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, ఆర్డీవోలు శ్రీనివాస్ రెడ్డి, శీను, రాజా గౌడ్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. రెండవ విడత ఓటర్ జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల ముందు, మనకు వచ్చిన ప్రతి దరఖాస్తు స్క్రూటినీ పూర్తి చేయాలని, ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరణ పూర్తి చేయాలని, ఇంటికి 6 కంటే అధికంగా ఉన్న ఓటర్ల వివరాల ధృవీకరణను పూర్తి చేయాలని తెలిపారు.
ఓటరు జాబితా నుంచి పెద్ద ఎత్తున ఓటర్ల వివరాలు తొలగించిన నేపథ్యంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, ఫోటో సిమిలర్ ఎంట్రీ, డబుల్ ఎంట్రీ తొలగించాలని అన్నారు. జిల్లాలో ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్ లైన్ ద్వారా ఫారం 6, ఫారం 7, ఫారం 8 క్రింద వచ్చిన దరఖాస్తులను జూలై 27 నాటికి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు.
జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద భారత ఎన్నికల సంఘం నిర్దేశాల మేరకు ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన అన్ని మౌళిక వసతులు ఉండాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల ఏర్పాటు, లైటింగ్, త్రాగునీరు, అవసరమైన ఫర్నీచర్, పురుషులకు, స్త్రీలకు ప్రత్యేకంగా టాయిలెట్లు, ఇతర సదుపాయాలు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంటే నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం రూపోందించిన జిల్లా ఎన్నికల ప్రణాళికను సమర్పించాలని సూచించారు. జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది, అందుబాటులో ఉన్న సిబ్బంది, వారికి శిక్షణ తదితర అంశాలతో సంపూర్ణ సమాచారంతో ప్రణాళిక రూపోందించాలని తెలిపారు. జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గ పరిధిలో ఈవిఎం, వివిప్యాట్ వినియోగం పై విస్తృతఅవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశం నుంచి జూలై 28 నుంచి స్విప్ కార్యక్రమాలు విస్తృతం చేయాలని, స్విప్ కార్యక్రమాల నిర్వహణపై రాజకీయ పార్టీలకు సమాచారం అందించాలని అన్నారు. ఎఫ్.ఎల్.సి పూర్తయిందని, సరిగ్గా పని చేస్తున్న , ఈవిఎం, వివిప్యాట్ యంత్రాల వివరాలు రాజకీయ పార్టీలకు ఇవ్వాలని, ఈవిఎం, వివిప్యాట్ యంత్రాలు ఉండే స్ట్రాంగ్ రూంకు పటిష్టమైన భద్రత కల్పించాలని, ఫైర్ ప్రమాదం నియంత్రణ కోసం ఫైర్ అలారంలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు.
లివీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులతో మాట్లాడారు,లి నియోజకవర్గ వారీగా వాహనాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం, ఆవాసాల వారీగా పర్యటించి ఈవిఎం, వివిప్యాట్ యంత్రాల వినియోగం పై అవగాహన కల్పించాలని, సెప్టెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు. ఈవిఎం, వివిప్యాట్ల పై ప్రజలకు అవగాహన కల్పించే ట్రైయినర్లకు మంగళవారం జూలై 18న జిల్లాలో శిక్షణ అందించాలని, జూలై 20 నుంచి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. సెప్టెంబర్ చివరి వరకు జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పూర్తి స్థాయి అవగాహన కల్పించేలా షెడ్యూల్ రూపోందించు కోవాలని అన్నారు.
జిల్లాలో ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా పురుషులు, మహిళల ఓటర్ల వివరాలు వయస్సు వారీగా, జనాభా నిష్పత్తి వివరాలు, లింగ నిష్పత్తి నివేదికలు తయారు చేయాలని అన్నారు. ప్రతి మండలం వారీగా సమాచారం సేకరించి నివేదికలు తయారు చేయాలని అన్నారు. సమావేశంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.