జక్రాన్‌పల్లి, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం జలాలను నిజామాబాద్ జిల్లా రైతుల పంట పొలాలకు చేర్చిన సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఇది ఒక మహా అద్భుత కార్యక్రమమని, కాళేశ్వరం నీళ్లు రూరల్ నియోజక వర్గం వరకు చేరుకోవటం న భూతో న భవిష్యత్ అన్నారు. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ నుండి పైపు లైన్ల ద్వారా పంపు హౌజ్‌ల ద్వారా 20 వ ప్యాకేజీతో నీళ్ళు తీసుకు వచ్చామన్నారు.
అర్థం పర్థం లేని ఆరోపలు చేసే ప్రతి పక్షాలకు ఇక్కడికి వచ్చిన నీళ్ళే సరైన సమాధానం చెప్తాయని, వట్టిపోయిన వాగులకు జలకళ సంతరించుకుందన్నారు. వాగులోకి వస్తున్న నీటిని చూసి సీఎం కేసీఆర్‌ని మనసారా ఆశీర్వదించండని, 20,21 ప్యాకేజీల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు విజ్ఞప్తి .మేము ఇచ్చిన మాట మేరకు 20,21 ప్యాకేజీల ద్వారా నీటిని తీసుకు వచ్చామని, మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికి తాగు నీరు ఇచ్చినట్లు ప్రతి మూడు ఎకరాలకు ఒక అవుట్ లేట్ వాల్వును ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు అవసరమయ్యే పైపు లైను వేసేందుకు రైతులు అవకాశం ఇవ్వాలని, కరెంట్, బోరు, వర్షాలతో సంబంధం లేకుండా వాల్వూ తిప్పగానే సాగునీరు మీ పంట పొలాల్లో చేరుతాయన్నారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులకు సాగు నీటిని డోఖా రానివ్వడన్నారు.
ఆర్టీసి చైర్మన్ బాజీ రెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ జిల్లా రైతాంగం తరపున సీఎం కేసీఆర్‌కి ధన్య వాదాలు తెలిపారు. 26 వందల కోట్ల వ్యయంతో ప్యాకేజీ పనులు చేపట్టి రైతులకు ఇచ్చిన మాట నేరవేర్చామని, ఇజ్రాయిల్ టెక్నాలజీతో ప్రాజెక్ట్ డిజైన్ చేసి పూర్తి చేసామని, కాళేశ్వరం జలాలు రూరల్ నియోజక వర్గం వరకు చేరు కోవటం ఒక చరిత్ర అని, కరువు వచ్చినా సాగునీల్లకు అంతరాయం ఉండదన్నారు. ఇప్పటికే 25 చెక్ డ్యాంలు పూర్తి చేసుకున్నామని, భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయన్నారు. రైతులు సీఎం కేసీఆర్‌ని ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇతర అధికారులు పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.