నిజామాబాద్, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాభావం వల్ల నిజామాబాద్ జిల్లా రైతులు వానకాలం పంటసాగుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసిఆర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీలో నింపేందుకు నిర్ణయించి, రోజుకు అర టీఎంసి చొప్పున గత పది రోజులుగా ఎస్సారెస్పీ లోకి కాళేశ్వర జలాలు నింపుకున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడిరచారు.
గత రెండు, మూడు రోజులుగా ఎస్సారెస్పీ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో, ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుండి వరద నీరు చేరుతుందని మంత్రి వెల్లడిరచారు. వానాకాలం సాగుకోసం 40 టిఏంసిలు అవసరమవుతాయనే అంచనాతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా రివర్స్ పంపింగ్ స్టార్ట్ చేయగా.. ప్రస్తుత రివర్స్ పంపింగ్ నీటితో, వరద నీటి ద్వారా ఎస్సారెస్పీ నీటి మట్టం 30 టీఎంసీలకు చేరుకున్నదని వెల్లడిరచారు. దీంతో వర్షాకాల సాగుకు రైతులకు సాగునీటికి డోఖా లేదన్నారు.
ఈ నేపథ్యంలో రివర్స్ పంపింగ్‌లో భాగంగా నడుస్తున్న పంపులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. కొద్ది రోజుల పాటు వర్షాలు, ఎగువ నీటిని అంచనా వేసి అవసరం ఉంటే మళ్ళీ రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని నింపే ప్రక్రియ పున:ప్రారంభిస్తామని మంత్రి జిల్లా రైతాంగానికి తెలిపారు.