నిజామాబాద్, జూలై 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్లలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయనకు అభినందనసభ నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ముఖ్య అతిథిగా విచ్చేయగా, గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు, పాలకవర్గం సభ్యులు కమిషనర్‌కు సాదర స్వాగతం పలికారు. ముందుగా ఆయన డిచ్పల్లిలోని టీఎస్‌ఎస్పీ పోలీస్ బెటాలియన్ అతిథి గృహానికి చేరుకుని పోలీసుల గౌరవ వందనం సవీకరించారు. నిజామాబాద్ ఆర్డీఓ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఇతర అధికారులతో స్థానిక అంశాలపై చర్చించారు. అనంతరం రావుట్ల గ్రామంలో ప్రొఫెసర్ లింబాద్రి అభినందన సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని సతీసమేతంగా ఘనంగా సన్మానించారు. ఆయన తల్లిదండ్రులతో పాటు గురువు అయిన ప్రొఫెసర్ రామచంద్రంలను సైతం ఘనంగా సత్కరించారు. మారుమూల గ్రామం రావుట్లలో జన్మించిన లింబాద్రి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నత విద్యను అభ్యసించి, అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును వక్తలు ప్రస్తావిస్తూ లింబాద్రిని కొనియాడారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, విద్యార్థులు తరలివచ్చి అభినందన సభను విజయవంతం చేయడం విశేషం.
ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి మాట్లాడుతూ, ప్రొఫెసర్ లింబాద్రి ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవి చేపట్టడంతో రావుట్ల గ్రామం చరిత్ర సృష్టించినట్లయ్యిందని అన్నారు. మారుమూల గ్రామం, పేద కుటుంబం నుండి వచ్చిన ప్రొఫెసర్ లింబాద్రి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖకు మార్గదర్శిగా నియమితులవడం ఎంతో గర్వకారణం అన్నారు. సౌమ్యుడు, అజాతశత్రువు అయిన లింబాద్రి అందరి ప్రేమాభిమానాలు పొందిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అందుకే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంలోనూ పెద్ద ఎత్తున గ్రామస్తులు సన్మాన సభకు తరలిరావడం ఆయన పట్ల ఉన్న ప్రేమాభిమానాలు చాటిందన్నారు.
ఎంతో నిబద్ధత, పరిణతి కలిగిన లింబాద్రి నేతృత్వంలో ఉన్నత విద్య మరింత ఉజ్వలంగా మారుతుందని, ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఛైర్మన్ లింబాద్రిని స్ఫూర్తిగా తీసుకుని యువత, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే అనుకున్న లక్ష్యానికి చేరుకోగల్గుతారని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు ఈ సందర్భంగా చైర్మన్ లింబాద్రితో కలిసి పని చేసిన అనుభవాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గుర్తు చేశారు. తాను తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్‌గా కొనసాగిన సమయంలో లింబాద్రి రిజిస్ట్రార్‌గా ఎంతో సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు.
తమ ఇద్దరి ఆలోచనలు ఒకేవిధంగా ఉండేవని, అందుకే తమను కృష్ణార్జునులుగా పిలిచేవారని అన్నారు. విద్యార్థులకు ఏదైనా మేలు చేయాలనే తలంపుతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వాటి ద్వారా సత్ఫలితాలు సాధించడంలో రిజిస్ట్రార్ గా లింబాద్రి చేసిన కృషి మరువలేనిదని కమిషనర్ పార్థసారథి మనస్ఫూర్తిగా అభినందించారు. నమ్మకస్థుడిగా, తెలివివంతుడిగా, చక్కటి నిర్వహణ సామర్థ్యం, స్నేహశీలి, సానుకూల స్వభావం, నిబద్ధత వంటి లక్షణాలు కలిగిన లింబాద్రి సార్థక నామధేయుడని ప్రశంసించారు. ఛైర్మన్ లింబాద్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ, తన ఎదుగుదలకు గ్రామస్థుల ప్రేమ, ఆప్యాయత, సహకారం ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు. ఎన్నో విషయాలను నేర్పిన రావుట్ల గ్రామంతో తనకు విడదీయరాని బంధం ఉందని, తాను ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత ఊరిని మర్చిపోలేనని భావోద్వేగానికి లోనయ్యారు. తాను చదువుకునే రోజుల్లో గ్రామంలో విద్యుత్, రవాణా వంటి వసతులు లేవని ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
కాలినడకన, ఎడ్లబండ్లపై రాకపోకలు సాగిస్తూ, కష్టపడి చదువుకుని గ్రామస్థుల సహకారం, తల్లితండ్రులు నేర్పిన సంస్కారంతో ఈ స్థాయికి వచ్చానని అన్నారు. అన్నింటికి మించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నమ్మకంతో తనకు మండలి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిందని, దళితుడికి ఈ పదవిని కట్టబెట్టడం ఉన్నత విద్యామండలి చరిత్రలోనే తొలిసారి అని ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు. తన నియామకానికి కృషి చేసిన జిల్లా ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి రవీందర్ యాదవ్, రిటైర్డ్ ఎస్పీ జాన్ వెస్లీ, రిటైర్డ్ జడ్జి నిమ్మ నారాయణ, చేయూత స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మధుశేఖర్, ఎంపిపి సంగీత, రాజేందర్, వైస్ ఎంపిపి రాజన్న, సర్పంచ్ భూదేవి రాజిరెడ్డి, వీడీసీ చైర్మన్ రమేష్ రెడ్డి, సభ్యులు, పాఠశాల హెచ్.ఎం బాలయ్య తదితరులు పాల్గొన్నారు.