నిజామాబాద్, జూలై 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడితో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని నివాస ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. చెరువులలో వచ్చి చేరుతున్న నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, చెరువులకు గండ్లు పడకుండా అప్రమత్తతో కూడిన చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఎక్కడైనా వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నట్లు గుర్తిస్తే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.