కామారెడ్డి, జూలై 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంతటి క్లిష్ట సమస్యలనైనా బ్యాలెన్స్ చేస్తూ ఓపికతో పరిష్కరిస్తూ వివిధ రంగాలలో జిల్లాను అభివృద్ధిపథంలో పయనించుటలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా వెంకటేష్ దోత్రే సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశమందిరంలో మహబూబ్‌నగర్ జిల్లాకు బదిలీపై వెళ్లిన వెంకటేష్ దోత్రేకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ మాట్లాడారు.
2018 లో సహాయ ట్రైనీ కలెక్టర్ గా వచ్చిన ధోత్రే ఇక్కడే అదనపు కలెక్టర్‌గా పదోన్నతి పొంది స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా తన మార్కు చూయించారని అన్నారు. దీనివెనుక వారి శ్రమ, కృషి ఎంతో ఉందన్నారు. మానవత్వం మూర్తీభవించిన ప్రేమతో ఆప్యాయంగా పలకరిస్తూ ఎవరిని నొప్పించక, ఇచ్చిన పనిని చక్కటి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేవారని తెలిపారు. స్థానిక సంస్థల పోస్టులో ఎన్నో ఒత్తిళ్లు ఉన్నా పనిలో నిమగ్నమై పూర్తి చేసేవరకు విశ్రమించారని చెప్పారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందరిని సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సేవలు జిల్లాకు అందించారని, అదే స్పూర్తితో అధికారులు, సిబ్బంది పనిచేయాలని కోరారు. బదిలీపై వెళ్లిన వెంకటేష్ ధోత్రే మాట్లాడుతూ సత్యనారాయణ, శరత్, జితేష్ వి.పాటిల్ కలెక్టర్లతో పనిచేసే అదృష్టం కలిగిందని తెలిపారు. పనిలో ఒక్కోక్కరిది ఒక్కొక్క శైలి అని, వారిఆలోచనలకనుగుణంగా అధికారులు, సిబ్బంది సహకారంతో విధులు నిర్వహించానని అన్నారు. కామారెడ్డి జిల్లాతో తనకు బలమైన అనుబంధం ఏర్పడిరదని అన్నారు. పంచాయతీ రాజ్, మునిసిపాలిటీలో పారిశుధ్య కార్మికులు, పంచాయతీ కార్యదర్శులు నుంచి అధికారుల వరకు అందరు టీం స్పిరిట్ తో పనిచేసే వారని అన్నారు.
అనంతరం దొత్రేను శాలువ, మెమెంటోలతో కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులు సన్మానించారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ట్రైనీ సహాయ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఆర్‌డిఓ సాయన్న, సిపిఒ రాజారామ్, జిల్లా పరిషత్ సీఈఓ సాయ గౌడ్, పోలీస్ ఓ.ఎస్.డి. అన్యోన్య, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.