కామారెడ్డి, జూలై 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల జాబితా రూపకల్పన పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం ఎన్నికల అధికారులకు ఓటర్ల జాబితా రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండవ విడత ఓటరు జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల ముందు వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలన పూర్తి చేయాలని అన్నారు.
ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధ్రువీకరణ పూర్తి చేయాలని చెప్పారు. ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్ లైన్ ద్వారా ఫారం-6, 7,8 క్రింద వచ్చిన దరఖాస్తులను జులై 27వ తేదీ నాటికి క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల ఏర్పాటు, లైటింగ్, త్రాగునీరు, ఫర్నీచర్, పురుషులకు, స్త్రీలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
ఓటర్ల సంఖ్య 1500 కన్నా ఎక్కువ ఉంటే నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది, అందుబాటులో ఉన్న సిబ్బంది, వారికి శిక్షణ అంశాలతో, సంపూర్ణ సమాచారంతో ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. డిక్లరేషన్‌లో దరఖాస్తు దారుడు పేర్కొన్న సమాచారం అసత్యమైనదని తెలిస్తే ప్రజాస్వామ్య ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశముందని అన్నారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్.డి.ఓ. శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ. రవీందర్, జిల్లా ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగ రావు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.