నిజామాబాద్, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వలస కార్మికుల సామాజిక రక్షణ అనే అంశంపై ఈనెల 24, 25 రెండు రోజులపాటు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగే బహుళ దేశాల ప్రాంతీయ సమావేశానికి గల్ఫ్ వలసల నిపుణుడు మంద భీంరెడ్డికి ఆహ్వానం అందింది. ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఏసియా అనే సంస్థ, మలేషియా కేంద్రంగా పనిచేసే అవర్ జర్నీ అనే సంస్థ కలిసి ఆగ్నేయ ఆసియా, దక్షిణ ఆసియా, గల్ఫ్ మధ్యప్రాచ్య దేశాల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహిస్తున్నది.
ఈ సమావేశం వలస కార్మికులకు అందుబాటులో ఉన్న ప్రస్తుత సామాజిక రక్షణ కార్యక్రమాలపై ఆసియా, గల్ఫ్ మధ్యప్రాచ్య దేశాల మధ్య బహుళ దేశాల ప్రాంతీయ చర్చ జరిపి తగిన సూచనలు చేస్తుంది. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉన్న అంతరాలు (గ్యాప్స్) ను గమనించి మరింత పటిష్టమైన కార్యక్రమాల కోసం సిఫార్సు చేస్తారు. కొలంబో ప్రాసెస్ (కార్మికులను విదేశాలకు ఉద్యోగానికి పంపే 11 సభ్య దేశాల కూటమి), ఆసియాన్ (ఆగ్నేయాసియాలో 10 సభ్య దేశాల కూటమి) జిఎఫ్‌ఎండీ (వలసలు, అభివృద్ధి పై ప్రపంచ వేదిక) లాంటి దేశాల కూటములు, వివిధ ప్రభుత్వాల ఉమ్మడి వేదికలపై సామాజిక రక్షణ గురించి విషయానుకూల వాదనల వ్యూహాలను ఖరారు చేయడం గురించి చర్చిస్తారు.
సామాజిక రక్షణపై ప్రభుత్వాలకు శ్రద్ధ తగ్గింది
వలసదారుల హక్కులపై అంతర్జాతీయ, ప్రాంతీయ, దేశీయ ప్రచారాలు ముమ్మరం అయ్యాయి. కానీ వలస కార్మికుల సామాజిక రక్షణ (సోషల్ ప్రొటెక్షన్) అంశంపై ప్రభుత్వాలకు శ్రద్ధ తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా వలస కార్మికులు పాస్ పోర్ట్, వీసా లాంటి పత్రాలు లేని (అన్ డాక్యుమెంటెడ్) సందర్భాలలో వలసకు ముందు, వలస తర్వాత సామాజిక రక్షణను పొందడంలో తీవ్రమ్కెన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇమ్మిగ్రేషన్ స్థితి లేదా వారు పనిచేస్తున్న రంగాల కారణంగా వలస కార్మికులు సామాజిక రక్షణ హక్కు నిరాకరించబడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇదివరకే పొందుతున్న ప్రయోజనాలను కార్మికులు మరొక దేశానికి వలస వెళ్ళేటప్పుడు లేదా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ ప్రయోజనాలు కొనసాగేలా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి.
‘ఆసియాన్’ దేశాలలో క్రమరహితమైన రంగాల్లో పనిచేసే వలస వచ్చిన కార్మికులలో చాలా మంది కార్మిక చట్టాల పరిధిలో లేరు. సామాజిక రక్షణ కూడా లేదు. ‘ఆసియాన్’ అంటే… అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్. ఆగ్నేయాసియాలో 10 సభ్య దేశాల కూటమి. ఇందులో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం దేశాలున్నాయి.
కోవిడ్ లో 49.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు
కోవిడ్ మహమ్మారి సమయంలో సమస్య మరింత తీవ్రమైంది, అంతకు ముందు పరిస్థితితో పోల్చినప్పుడు కార్మికులు మరింత కష్టాల పాలయ్యారు. ఒక అసాధారణమైన ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రపంచ వ్యాప్తంగా 49.5 కోట్ల మంది తమ ఉద్యోగాలు, ఆదాయాలను కోల్పోయారు. అసహాయులైన లక్షలాది మంది వలస కార్మికులు ఉట్టి చేతులతో విదేశాల నుండి తమ స్వదేశాలకు చేరుకున్నారు. మహమ్మారి వలస కార్మికులపై అధిక స్థాయి దుర్బలత్వం కేంద్రీకృతమైంది. ముఖ్యంగా మహిళా వలస కార్మికులు మరింత అనిశ్చిత, అసురక్షిత, క్రమరహితమయిన ప్రాథమిక వృత్తులు అని పిలవబడే వాటిలో అసమానంగా కేంద్రీకృతమై ఉన్నారు. వలస కార్మికులు ఆరోగ్య సంరక్షణ, రవాణా, నిర్వహణ లాంటి ముఖ్యమైన ఉద్యోగాలు నిర్వహించడంలో ముందు వరుస (ఫ్రంట్ లైనర్స్) గా ఉన్నారు. కానీ సామాజిక రక్షణ పొందలేక పోవడం, మహమ్మారి సంసిద్ధత ప్రణాళికల నుండి మినహాయింపు వలన దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు.
ప్రపంచ సామాజిక సురక్ష నిధి ఏర్పాటు చేయాలి
ప్రపంచ సామాజిక సురక్ష (గ్లోబల్ సోషల్ ప్రొటెక్షన్) అంతరాన్ని పూడ్చేందుకు, అంతర్జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య ప్రచారోద్యమం చేపట్టింది. చెల్లించే ప్రీమియం భరించగలిగిన సరసమైన ధరలో ఉండే విధంగా జాతీయ సామాజిక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రపంచ సామాజిక సురక్ష నిధి (గ్లోబల్ సోషల్ ప్రొటెక్షన్ ఫండ్) ను ఏర్పాటు చేయాలి. పేదరికాన్ని తగ్గించడానికి, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేందుకు సామాజిక రక్షణ వ్యవస్థలను నిర్మించడంలో ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలు చేపట్టాలి. పన్ను ఎగవేత, పన్ను పోటీ, సోషల్ డంపింగ్ (సామాజిక కుమ్మరింపు – తక్కువ వేతనాలతో కార్మికులతో పని చేయించుకోవడం) ఏకకాలంలో పరిష్కరించేటప్పుడు ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన కనీస కార్పొరేట్ పన్ను విధానం ఉండాలి. ఇందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల తోడ్పాటు అవసరం. దేశీయ కార్యక్రమాల కోసం ఇప్పటికే ఉన్న నిధులను ఉపయోగించవచ్చు. ఇది రుణ ఉపశమనం లేదా రద్దు మరియు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ లిక్విడిటీ మార్పిడుల ద్వారా పూర్తి చేయబడుతుంది.
గమ్యస్థాన దేశాలలో 22 శాతం మందికే సామాజిక రక్షణ
ప్రజలందరూ గౌరవప్రదంగా జీవిస్తారని హామీ ఇవ్వడానికి, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) సామాజిక భాగస్వాములు 2012లో సామాజిక రక్షణ అంతస్తుల సిఫార్సును స్వీకరించారు. ఆగ్నేయాసియాలో 10 సభ్య దేశాల అంతర్జాతీయ కూటమి (ఆసియాన్) 2013లో తన 23వ ఆసియాన్ సమ్మిట్ సందర్భంగా సామాజిక రక్షణను బలోపేతం చేయడంపై ఆసియాన్ డిక్లరేషన్‌ను ఆమోదించింది.
ఈ కార్యక్రమాలన్నీ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో (స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) పొందుపరచబడిన ప్రాథమిక మానవ హక్కుగా సామాజిక రక్షణకు హామీ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలు వలస కార్మికులందరికీ వర్తించేలా పునరుద్ఘాటించాయి. డ్యూటీ బేరర్లు (విధులు నిర్వర్తించే ప్రభుత్వ వ్యవస్థ) ద్వారా అన్ని అవకాశాలు హామీలు ఉన్నప్పటికీ సామాజిక రక్షణ కార్యక్రమాలు ప్రపంచ జనాభాకు పెద్దగా అందుబాటులో లేవు. వలస కార్మికుల విషయానికొస్తే, గమ్యస్థాన దేశాలలో కేవలం 22% మాత్రమే సామాజిక రక్షణలో ఉన్నారు. అంతేకాకుండా, 163 దేశాలలో 70 దేశాలు సామాజిక రక్షణ చట్టాలను కలిగి ఉండగా, 70 కంటే తక్కువ దేశాలు వలస వచ్చిన ఇంటి పని మనుషులను కవర్ చేస్తున్నాయి.
నయా ఉదారవాద అభివృద్ధి హానికరం
ప్రబలమైన ప్రైవేటీకరణ ద్వారా నయా ఉదారవాద అభివృద్ధి (నియో లిబరల్ డెవలప్మెంట్) ధోరణిని కొనసాగించడం, పొదుపు చర్యలను విధించడం వల్ల ఎక్కువ మంది ప్రజలకు మరింత హానికరమైన సామాజిక ఆర్థిక పరిణామాలు సృష్టించబడ్డాయి. వీటిలో పెరిగిన పేదరికం, ఆదాయ పంపిణీ క్షీణత, సామాజిక రక్షణను తగ్గించే ఒత్తిళ్లు ఉన్నాయి. బలహీన సమూహాల ప్రజలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, వైకల్యం ఉన్నవారు, పేదరికంలో నివసించే వ్యక్తులు, వలస వచ్చినవారు ‘మిస్సింగ్ మిడిల్’ (అనధికారిక ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్ లోని కార్మికులు, స్వయం ఉపాధి, ఇంట్లో ఉండి పనిచేసే గృహ ఆధారిత కార్మికులు) సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. సామాజిక రక్షణ అందుబాటు పూర్తి సాక్షాత్కారం కోసం ఈ బహుళ దేశాల ప్రాంతీయ సమావేశం చర్చా వేదిక ఉపయోగపడేలా చేయడం ఈ సమావేశం లక్ష్యం.