నిజామాబాద్, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా అన్ని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల తుది జాబితాను సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉన్నందున, అన్ని పోలింగ్ స్టేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎక్కడైనా మార్పులు, కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్లయితే ఈ.ఆర్.ఓ లకు ప్రతిపాదనలు సమర్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల పేర్లలో ఏవైనా మార్పులు చేయాల్సి ఉన్నా, అక్షర దోషాలను సవరించాల్సి ఉన్న వాటి గురించి అధికారుల దృష్టికి తేవాలన్నారు.
కొత్తగా ఏర్పడిన మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల పేర్లలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నందున, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత ఈ.ఆర్.ఓ లను ఆదేశించారు. అలాగే, పురాతన కాలం నాటి, శిథిలావస్థకు చేరిన భవనాలలో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాలను వేరేచోటికి మార్చడం, 1400 పైచిలుకు ఓటర్లు కలిగిన పోలింగ్ స్టేషన్ల పరిధిలో కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉన్నందున ఈ అంశాలపై దృష్టి సారించాలన్నారు.
నివాస ప్రాంతానికి ఎక్కువ దూరంలో ఉండే పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తించి ప్రతిపాదనలు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. కాగా, ఓటర్ల జాబితా పక్కాగా రూపొందేలా రాజకీయ పక్షాలు తమవంతు సహకారం అందించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా చిన్నచిన్న పొరపాట్లు ఉంటే, అలాంటి వాటిని గుర్తించి సరి చేసుకున్నట్లైతే ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రస్తావించిన పలు అంశాలపై కలెక్టర్ వారికి అవగాహన కల్పిస్తూ, సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, ఆర్డీఓలు రవికుమార్, రాజేశ్వర్, వినోద్ కుమార్, నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.